నోటిఫైడ్ గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దానిని కొట్టివేసింది.
తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు.. నోటిఫైడ్ గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికే ఉపాధ్యాయ ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీల్లోని స్కూల్ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పునరుద్ఘాటించేందుకు 1992 నాటి ఇందిరా సాహ్నీ కేసులో తీర్పును కోర్టు ఉదహరించింది. అన్నిచోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెండున్నర లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు జరిమానాను చెల్లించింది. తెలంగాణ సర్కార్ జీవోను నిలుపుదల చేసిన.. జరిమానా మాత్రం చెల్లించలేదు. మరోవైపు కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాజాగా తెలంగాణ సర్కార్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించడంలో తెలంగాణ సర్కార్ అలసత్వం ప్రదర్శించిందని సుప్రీం కోర్టు పరగిణించింది. జరిమానా చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది. జరిమానా చెల్లించకుంటే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని హెచ్చరించింది.
రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందునే జరిమానా చెల్లించలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే వెంటనే జరిమానా చెల్లించాలని.. ఆ తర్వాతే మిగిలిన విషయాలను చర్చిద్దామని పేర్కొంది.
