హైదరాబాద్: కార్మికులకు సంబంధం లేకుండానే సింగరేణి యాజమాన్యం ఒక్క రోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి  కరోనా సహాయం కింద విరాళంగా ప్రకటించడంతో పాటు వేతనంలో 50 శాతం కోత విధించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.దీంతో సింగరేణి యాజమాన్యానికి గురువారం నాడు నోటీసును ఇచ్చాయి. కార్మిక సంఘాలు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీ నుండి సమ్మె చేపడుతామని హెచ్చరించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఒక్క రోజు వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవడాన్ని కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. మరో వైపు వేతనంలో 50 శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.బొగ్గు గనులను లే ఆఫ్ కాకుండా లాక్ డౌన్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

Also read:వనపర్తి‌లో కొడుకు ముందే తండ్రిపై పోలీసుల దాడి ఘటన: కానిస్టేబుల్ సస్పెన్షన్

లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, కార్మికులకు పూర్తి జీతంతో కూడిన లాక్ డౌన్ ప్రకటించిన విషయాన్ని సింగరేణి కార్మిక సంఘాలు గుర్తు చేశాయి. డీజీఎంఎస్ కు నోటీసు ఇచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.లే ఆఫ్ కాకుండా లాక్ డౌన్ చేయకూడదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లే ఆఫ్ నిబంధనలకు విరుద్దమని కార్మిక సంఘాలు ప్రకటిస్తున్నాయి.

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వదని కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి.. కార్మికులతో సంప్రదించకుండానే సింగరేణి కార్మికుల ఒక్క రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారని యాజమాన్యానికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.. 

ప్రాణాలు లెక్క చేయకుండానే తాము విధులు నిర్వహిస్తున్న విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తు చేశాయి. తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుండి సమ్మె నిర్వహిస్తామని కార్మిక సంఘాలు ఆ నోటీసులో హెచ్చరించాయి.