టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. సుప్రీం కోర్టు ఏమందంటే..

First Published 16, Jul 2018, 2:01 PM IST
SC tells Centre: Form action plan to prevent drug circulation
Highlights

విచారణ సందర్భంగా డ్రగ్స్‌ నియంత్రణకు ఉద్దేశించిన విధివిధానాలు రూపొందించేందుకు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కేంద్ర కోరగా.. ఇప్పటివరకు విధివిధానాలు ఎందుకు రూపొందించలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ లో గతేడాది డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

విచారణ సందర్భంగా డ్రగ్స్‌ నియంత్రణకు ఉద్దేశించిన విధివిధానాలు రూపొందించేందుకు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కేంద్ర కోరగా.. ఇప్పటివరకు విధివిధానాలు ఎందుకు రూపొందించలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగష్టు 31లోపు విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి సూచించింది. అయితే, ఇందుకోసం కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటరల్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. విధివిధానాలు రూపొందించడంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సహకారం ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు నివేదించారు. 

ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరగా.. విధివిధానాలు రూపొందించిన తరువాత, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే విషయం గురించి ఆలోచిద్దామని ధర్మాసనం  స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

loader