హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని చాదర్ ఘట్ పోలీసు స్టేషన్ పరిధిలో దళిత  మైనర్ బాలికపై ఓ యువకుడు పాల్పడిన అత్యాచార ఘటనను  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమోటాగా స్వీకరించారు.  ఘటనపై వెంటనే స్థానిక పోలీసు అధికారులను కేసు విచారణను చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

రెవిన్యూ అధికారులతో మాట్లాడి బాధితురాలికి అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎక్స్ గ్రేసియాను అందజేయాలని సూచించారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. చాదర్ ఘట్ లోని సంఘటన తమ దృష్టికి రాగానే కమిషన్ సుమోటాగా స్వీకరించిందని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు.

బాధితురాలికి ఎక్స్ గ్రేసియా అందించాలని, అన్ని విధాలుగా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించామని చెప్పారు. .రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలకు కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రాంబల్ నాయక్ లతో కలిసి ఆయన చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు జరిగిందని, నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని, బాదిత బాలికకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన , స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు బాలిక వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే హడావిడి చర్యలు చేపట్టకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగిందని, తమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బాలిక కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండి, అమ్మాయి భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

దళిత బాలిక పట్ల ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడిన షకీల్ కు కఠిన శిక్ష పడుతుందని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు తావులేదని, ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

అమ్మాయిని ఓదార్చడం కోసం రాజకీయాలు చేయొద్దని, రాజకీయ హడావిడిలో అమ్మాయి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.