కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రూట్ మార్చారు. ఆయన టిడిపిలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా సిఎం కేసిఆర్ కే ఉత్తరాలు రాసేవారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి రూట్ మార్చారు. కేసిఆర్ కు కాకుండా కేటిఆర్ కు రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్ రాశారు. ఆ లేఖలో తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలను వివరించారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం కింద ఇస్తున్నాం.

 

24.03.2018
బ‌హిరంగ లేఖ‌
 
తెలంగాణా రాష్ట్ర గ‌నుల శాఖ మంత్రి శ్రీ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్‌) గారికి..
 
రాష్ట్రంలో ఇసుక దోపిడీ య‌దేచ్ఛ‌గా జ‌రుగుతోంద‌ని, ప్ర‌భుత్వ అనుమ‌తుల ముసుగులో అక్ర‌మార్కులు నిబంధ‌న‌ల‌కు తూట్లుపొడుస్తూ, తాము కోట్లు గ‌డిస్తూ సామాన్యుల ప్రాణాలు తీసేస్తున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీగా మేము చెప్పిన ప్ర‌తిసారీ మీరు కాంగ్రెస్ పార్టీపై నోరుపారేసుకోవ‌డం మిన‌హా జ‌రుగుతున్న వాస్త‌వాల‌పై క‌నీసం విచార‌ణ చేయిస్తామ‌ని కూడా ఎప్పుడూ చెప్ప‌లేదు..పైగా మీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఇసుక వ్యాపారం ప‌క‌డ్బందీగా జ‌రుగుతోంద‌ని దీని ద్వారా మునుపెన్న‌డూ రానంత భారీ ఆదాయం ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి వ‌స్తోంద‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప ఇసుకాసురుల ఆగ‌డాల‌ను నిల‌వ‌రించే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌లేదు..ఇసుక దోపిడీపై మేము చెప్పిన విష‌యాల‌నే  మీడియా సాక్ష్యాధారాల‌తోస‌హా బ‌య‌ట‌పెట్టింది.. ఇసుక దోపిడీపై మేము చెప్తూవ‌స్తున్న‌ది అక్ష‌ర‌స‌త్య‌మ‌ని నిరూపించింది..ఇసుక అక్ర‌మాల‌పై ఇప్పుడు మీరు నోరు విప్ప‌క‌త‌ప్ప‌ని త‌రుణం ఆస‌న్న‌మైయింది..
 
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని తాళ్ల‌పాము-పొగుళ్ల‌ప‌ల్లి మ‌ధ్య‌నున్న ముర్రేడు వాగు నుంచి ఇసుక ర‌వాణా చేసేవారికి తేదీలు వేయ‌ని వే బిల్లుల‌ను ఇవ్వడం ద్వారా ఎప్పుడో త‌నిఖీలు జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప మిగిలిన స‌మ‌యాల్లో వే బిల్లులు లేకుండానే ఇసుక‌ను ర‌వాణా చేస్తున్న‌ర‌నే విష‌యం ఈరోజు మీడియాలో వ‌చ్చింది కానీ మేము నేరెళ్ల సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే ఈ వే బిల్లుల వ్య‌వ‌హారం గురించి ప్ర‌భుత్వానికి మీడియా ద్వారా ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది.. వే బిల్లులు లేకుండా ఇసుక ర‌వాణా చేయ‌డం అటుంచితే ఒకే నెంబ‌రుపై ప‌ది నుంచి ఇర‌వై లారీల దాకా తిర‌గ‌డం, ఆ నెంబ‌రు కూడా న‌కిలీదే కావ‌డం గురించి మీడియాలోనూ స‌మాచారం ఇవ్వ‌డం జ‌రిగింది.. కానీ ఏ రోజూ మీరు మాట‌ను ల‌క్ష్య పెట్ట‌లేదు.20 ట‌న్నులు నింపాల్సిన లారీలో 30 ట‌న్నుల ఇసుక‌ను నింప‌డం, 30 ట‌న్నుల లారీలో 40 నుంచి 45 ట‌న్నుల దాకా ఇసుక‌ను నింపి అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతుండ‌టంతో ఇసుక క్వారీల‌కు దారితీసే రోడ్లు పూర్తిగా పాడైపోతున్నాయ‌ని, ఒకే రోజులో ఎక్కువ ట్రిప్పుల ఇసుక‌ను ర‌వాణా చేయాల‌న్న ఉద్దేశ్యంతో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీలు అమాయ‌కుల ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయ‌ని మీడియా కోడైకూసినా, మేము నేరుగా మీ ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు చేసినా ఫ‌లితం శూన్యం. అతివేగంగా వెళ్లే ఇసుక లారీల కార‌ణంగా అవి వెళ్లే మార్గంలో ఉన్న గ్రామాల ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో గ‌జ‌గ‌జ‌వ‌ణికిపోతున్నారు. అన్ని జిల్లాల‌లోనూ ఈ ఇసుక లారీల కార‌ణంగా నెల‌కు స‌గ‌టున న‌లుగురైనా ప్రాణాల‌ను కోల్పోతూనే ఉన్నారు. ఇసుక అమ్మ‌కాల ద్వారా ప్ర‌భుత్వానికి వెయ్యి కోట్ల రుపాయ‌ల ఆదాయం వ‌స్తోంద‌ని  చెప్పుకుంటున్న మీకు ఆ ఇసుక ర‌వాణా చేసే లారీల కార‌ణంగా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వ‌డానికి కూడా చేతులు రాక‌పోవ‌డంతో ఎన్నో కుటుంబాలు చితికిపోయి రోడ్డున ప‌డ్డాయి. ఈ ప‌రిస్థితుల్లోనే మీరు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల‌, జిల్లెల ప్రాంతాల్లో ఇసుక లారీలు అనేక మందిని పొట్ట‌న‌పెట్టుకున్నాయ‌ని ఈ కార‌ణంగానే అక్క‌డి ద‌ళిత‌, బీసీ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆగ్ర‌హించి ఇసు లారీల‌ను త‌గుల‌బెట్టే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వివ‌రించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోగా పోలీసుల‌ను ప్ర‌యోగించి అమాయ‌కుల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసింది.

ఒక్క ముర్రేడువాగులోనే కాదు..ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని దుందుభి, ఊక‌చెట్టు వాగుల నుంచి మొద‌లుకొని గోదావ‌రి న‌ది దాకా ప్ర‌తిచోటా ఇసుక క్వారీల‌లో అక్ర‌మాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే  రాష్ట్రంలో ఉన్న అన్ని న‌దులు, వాగుల నుంచి ఇసుకను అక్ర‌మంగా త‌ర‌లిస్తూనే ఉండ‌టం,  ఈ స‌మాచారాన్ని స్థానిక మీడియా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూనే ఉన్నా ప్ర‌భుత్వ మాత్ర త‌న‌కేమీ తెలియ‌న‌ట్లు మొద్దునిద్దుర న‌టిస్తోంది.దీనికి కార‌ణం ఈ ఇసుక దందాలో మీ పార్టీకి చెందిన నాయ‌కులు, మీకు వంత‌పాడే మీ వందిమాగ‌ధుల‌తోపాటు మీ బంధువ‌ర్గం కూడా ఉండ‌ట‌మేన‌న్న‌ది తెలంగాణా ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన వాస్త‌వం. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇసుక క్వారీల‌ను మీ బంధువులైన రాజేంద‌ర్ రావు, ప్ర‌వీణ్‌రావు, న‌డింప‌ల్లి రంగారావు, జోగినిప‌ల్లి సంతోష్‌రావుల‌వేన‌ని మేము గ‌తంలోనే బ‌హిరంగంగా కూడా చెప్ప‌డం జ‌రిగింది.  ఇసుక దందాలో మీ కుటుంబ‌ప్ర‌మేయం ఉన్న‌ కార‌ణంగానే  వేగంగా వెళ్తూ ప్ర‌మాదాలు చేసి ప్రాణాలు తీసే స్థాయి నుంచి త‌మ‌కు ఎదురొచ్చిన విఎఓపై ట్రాక్ట‌ర్ పోనిచ్చి ప్రాణం తీసే స్థాయికి ఇసుక మాఫియా చేరింది. ఇసుక‌ను వాగులు, వంక‌లు, న‌దుల నుంచే కాకుండా అడ‌వుల్లోనుంచి కూడా అక్ర‌మంగా తోడేస్తున్నారు. అప్పుడ‌ప్పుడూ పోలీసులు, అట‌వీ అధికారులు అక్ర‌మ ఇసుక వాహ‌నాల‌ను ప‌ట్టుకొని కేసులు పెడుతున్నావారికి మీ ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ ఉండ‌టంతో ప‌ట్టుకున్న వాహ‌నాల‌ను సుల‌భంగా విడిపించుకొని మ‌ళ్లీ య‌ధాప్ర‌కారం ఇసుక ర‌వాణా కొన‌సాగిస్తున్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలాంటి కొన్ని ప్రాంతాల్లో జిపిఎస్ పెట్టామ‌ని మీరు చేతులు దులిపేసుకున్నా జీపిఎస్ క‌న్నుగ‌ప్పి రాత్రిళ్ల‌లో అక్ర‌మ ఇసుక ర‌వాణా కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు భారీగా పెరిగిన ఇసు ధ‌ర‌ల కార‌ణంగా ప్ర‌భుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం వ‌స్తోంద‌ని మీరు గొప్ప‌లు చెప్పుకుంటున్నారు, కానీ అక్ర‌మార్కుల దోపిడీ కార‌ణంగా ప్ర‌భుత్వానికి వాస్త‌వంగా రావాల్సిన మ‌రో రూ.3000 కోట్ల ఆదాయం రాకుండాపోతోంద‌ని దానిని అక్ర‌మార్కులు త‌న్నుకుపోతున్నార‌ని మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము. గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఐటీడిఎ ప‌రిధిలో ఉండే ఇసుక రీచ్‌ల‌ను కేవ‌లం స్థానికులైన ఆదివాసీ గిరిజ‌న అడ‌విబిడ్డ‌ల‌కే కేటాయించాల‌ని చ‌ట్టం చెబుతున్నా, ఆ చ‌ట్టాల‌ను కూడా స‌వ‌రించి రైజింగ్ కాంట్రాక్ట‌ర్ల పేరిట బ‌య‌టివ్య‌క్తుల‌కు ఆ రీచ్‌ల‌ను క‌ట్ట‌బెట్టి, ఆదివాసీల‌కు రావాల్సిన వంద‌ల కోట్ల ఆదాయానికి గండికొడుతుండ‌టం దీనికి తిరుగులేని తార్కాణం. ఈ నేప‌థ్యంలోనే ఇసుక అక్ర‌మ‌ర‌వాణాకు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి మా డిమాండ్ల‌ను మీ ముందుపెడుతున్నాము.
 
• రాష్ట్రంలోని ప్ర‌తి ఇసుక రీచ్‌వ‌ద్ద నిరంత‌రం ప‌నిచేసే సిసీ కెమెరా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి
• ఇసుక ర‌వాణాకు అనుమ‌తించిన ప్ర‌తిజిల్లా కేంద్రంలో సిసి కెమెరాల కంట్రోల్‌, క‌మాండ్ సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేసి నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాలి.
• పంచాయితీల‌కు త‌మ ప‌రిధిలో ఉండే ఇసుక రీచ్‌ల‌ను త‌నిఖీ చేసే అధికారం ఇవ్వాలి.
• ఐటిడిఎల ప‌రిధిలోని ఇసుక రీచ్‌ల కేటాయింపులో రైజింగ్ కాంట్రాక్ట‌ర్ విధానాన్ని ర‌ద్దు చేసి వాటిని పూర్తిగా అడ‌విబిడ్డ‌ల‌కే కేటాయించాలి.
• ఇసుక రీచ్‌లు ఉన్న ప్ర‌తిమార్గంలో చెక్‌పోస్ట్‌ల‌ను ఏర్పాటు చేయాలి.
• రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌,అట‌వీ,ర‌వాణా అధికారుల‌తో పాటుగా సంబంధిత పంచాయితీల స‌ర్పంచ్‌ల‌ను  త‌నిఖీల కోసం చెక్‌పోస్ట్‌ల‌లో నియ‌మించాలి.
• ఇసుక అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న వ్య‌క్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేయాలి.
• ప‌ట్టుబ‌డిన వాహ‌నాల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి.
• ఇసుక లారీల కార‌ణంగా ఇప్ప‌టిదాకా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించాలి.
 
ఈ విష‌యంగా మీరు స్పందించి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోని ప‌క్షంలో అక్ర‌మ ఇసుక‌ర‌వాణాను అడ్డుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌జాందోళ‌న చేప‌ట్ట‌డానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంద‌ని తెలియ‌జేస్తున్నాము.
 
(ఎ.రేవంత్ రెడ్డి)