హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసుల్లో శాంపిల్స్ ఇచ్చి, కౌన్సిలింగ్ తీసుకొన్నవారి పేర్లను ఛార్జీషీట్ లో చేర్చలేదని ఈ కేసును విచారించి రిటైరైన ఎక్సైజ్  డిప్యూటీ కమిషనర్  వివేకానందరెడ్డి చెప్పారు.

బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. టాలీవుడ్  లోని డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో 8 కేసుల్లో ఛార్జీషీట్ దాఖలు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కొందరు నటులు పునరావాస కేంద్రంలో ఉండడానికి ఇష్టపడలేదన్నారు. అంతేకాదు కొందరు నటులు కనీసం తమ బ్లడ్ శాంపిల్స్ కూడ ఇవ్వడానికి కూడ నిరాకరించినట్టుగా ఆయన చెప్పారు. 

ఛార్జీషీట్ లో పేరున్న వారికి రెండేళ్ల వరకు శిక్ష పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల నుండి పెద్ద మొత్తంలో టాలీవుడ్ కు డ్రగ్స్ చేరుకొంటున్నాయని ఆయన చెప్పారు. టాలీవుడ్ లోని కొందరి వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌సీబీ సేకరించిందని ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసులో ఉన్నవారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్టుగా ఆయన చెప్పారు.