కరీంనగర్: కరోనా మహమ్మారిని అరికట్టడానికి పోలీసులు ప్రజలతో ఎంత కటువుగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. వైరస్ ప్రభలకుండా వుండేందుకు ప్రజలను బయటకు రాకుండా చూస్తున్న పోలీసులు అవసరమైతే లాఠీలు ఝలిపిస్తున్నారు. అయితే ఇలా కఠినంగా వుండటమే కాదు అవసరమైతే ప్రజలపై ప్రేమను కూడా చాటుతున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లా  పోలీసులు ఓ గర్బిణి వైద్యం కోసం సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 

 లాక్ డౌన్ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తా లో గురువారం పోలీపులు వాహనాల తనిఖీ చేపట్టారు. పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసిపి ఉమేందర్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ పి.రమేష్ ఇతర సిబ్బందితో డ్యూటీలో ఉండగా శ్రవణ్ అనే వ్యక్తి నిండు గర్భిణి అయిన తన భార్య పూజను ద్విచక్రవాహనంపై హాస్పిటల్ కు తీసుకెళుతున్నాడు.  దీంతో 

ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళుతుండటాన్ని గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తాము వైద్యం నిమిత్తం హాస్పిటల్ కు వెళుతున్నామని వారు పోలీసులుకు తెలియజేశారు. దీంతో గర్బిణికి ఇలా బైక్ పై తరలించడం ప్రమాదకరం కావడంతో పోలీసులు తమ వాహనంలో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అంతేకాకుండా పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. 

దీంతో సదరు  గర్బిణి కుటుంబసభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా పోలీసులు గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడుతున్నారు.