30 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడు చోరీలకు పాల్పడే విధానం, ఇప్పటి వరకు చేసిన దొంగతనాల వివరాలు అన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ మీడియాకు శుక్రవారం తెలియజేశారు.
అతడు ఓ దొంగ. దొంగ అంటే మరీ ఆశామాషీ దొంగకాదు. చోరీలు చేయడంలో అతడు నేర్పరి. ఈ వృత్తిలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. దొంగతనాలు అతడికి కొట్టిన పిండి. మనోడికి దొంగతనాలు చేయడంలో ఒక సపరేటు స్టైలు ఉంది. ఆ స్టైలు మీరు ఎక్కడా విని ఉండరు చూసి ఉండరు కూడా. ఎంతటి నేర్పరి అయినా ఇలాంటి చెడ్డ పనులకు పాల్పడుతుంటే పోలీసులకు చిక్కకుండా ఉంటాడా ? ఇక్కడా అదే జరిగింది. దీంతో తన నేరాల చిట్టా మొత్తం బయటపెట్టాడు. ఇంత పెద్ద ఘనుడు అసలు పోలీసులకు ఎలా చిక్కాడు.. ? అసలు అతడు దొంగతనాలు ఎలా చేస్తాడు అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి అదేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలానికి చెందిన ముచ్చు అంబేద్కర్ కు యాబై ఏళ్లు. ఆయనకు రాజు, రాజేష్, ప్రసాద్, కందుల రాజేందర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆయా పేర్లను వాడుకుంటూ ఉంటాడు. 20 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అంతకు ముందు పదేళ్ల నుంచి అంటే అతడికి 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే దొంగతనాలు ప్రారంభించాడు. ఎలక్ట్రీషియన్ గా కూడా పని చేస్తాడు.
నిందితుడు దొంగతనం చేయడంలో ఒక పద్దతి అనుసరిస్తాడు. ముందుగా హైదరాబాద్ సిటీలో ఉన్న ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఫుత్ పాత్ పై నిద్రపోతాడు. ఆ నిద్రలో కలలో కనిపించిన ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. తెల్లారిన తరువాతా ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడి పరిస్థితిని మొత్తం అంచనా వేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తాడు. అన్నీ అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత అర్ధరాత్రి ఆ తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తాడు.
ఇంటి తాళ్లాన్ని, కిటికీలకు ఉన్న ఇనుప చువ్వలను నిందితుడు ఈజీగా, వేగంగా తొలగిస్తాడు. అనంతరం అంతే స్పీడ్ తో ఆ ఇంటికిలోకి చొరబడి దొంగతనం చేస్తాడు. డబ్బులు, విలువైన నగలు కొట్టేసి నిమిషాల్లో బయటకు జంప్ అవుతాడు. అతడు దొంగతనంలో తన మొదటి ప్రియారిటీ బంగారానికే ఇస్తాడు. ఇలా మొదటి సారి 1990-91 సంవత్సరంలో కార్ఖానా, లాలాగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్ ల పరిధిలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
జైలు నుంచి విడుదలైన తరువాత కర్ణాటకకు వెళ్లాడు. అక్కడ కూడా కొన్ని దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ లో 2016 సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకు దాదాపుగా 43 దొంగతనాలు చేశాడు. దొంగతనం చేసిన బంగారాన్నీ, డబ్బును ఏపీలోని గుంటూరులో ఉన్న అతడి ఇంట్లో దాచుకునేవాడు. అయితే కొన్ని సార్లు డబ్బులు అవసరం ఉంటే ఆ బంగారాన్ని ఫైన్సాన్స్ కంపెనీల్లో ఉంచేసీ లోన్ తీసుకునేవాడు.
పోలీసులకు ఎలా దొరికాడంటే ?
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో గత సంవత్సరం అక్టోబర్ లో దొంగతనం జరిగింది. అయితే ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటంతో నిందితుడి కదలికలు అందులో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే పోలీసు స్టేసన్ పరిధిలో నిందితుడు అనుమానస్పదంగా సంచరిస్తూ ఉండటంతో అంబేద్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించడంతో పోలీసులకు తన దొంగతనాల వివరాలన్నీ చెప్పాడు. రాత్రి కల గని, పగటి సమయంలో రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేస్తుంటానని ఒప్పుకొన్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే పద్దతిని అనుసరిస్తున్నాని చెప్పాడు. ఈ వివరాలు అన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆఫీసులో సీపీ మహేష్ మీడియాకు శుక్రవారం తెలియజేశారు. నిందితుడి నుంచి 230 గ్రాముల బంగారం, 10.2 కేజీల వెండి వస్తువులు, 18 వేల రూపాయిలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
