నిషేదిత మత్తు పదార్థాలను ఎవరికీ అనుమానం రాకుండా ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి చాకచక్యంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌లో ఇలా డ్రగ్స్ ని తరలిస్తూ పట్టబడిన నిందితుల నుండి 90 వేల విలువైన మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నట్లు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.  

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు కమీషన్ తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరాకు సంబందించిన మరింత సమాచారం రాబట్టేందుకు వీరిని విచారించనున్నట్లు ఆయన పేర్కోన్నారు. 

పట్టుబడిన నిందితులిద్దరి నుండి 133 గ్రాముల బరువున్న 7 డ్రగ్స్ ప్యాకెట్సతో పాటు, 2 సెల్‌ఫోన్లు, 26 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. ట్యాబ్లెట్ల రూపంలో వున్న మత్తు పదార్థాలను కాలేజీ యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ట్యాబ్లెట్‌ను వారు రూ.150 కి విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. ఇవి దాదాపు మూడు రోజుల పాటు పనిచేస్తాయని...అత్యంత మత్తును కలిగించే వీటిని యువతకు అలవాటు చేసి వీరు సొమ్ము చేసుకుంటున్నట్లు సిపి తెలిపారు. 

పట్టుబడ్డ నిందితులు ఈ మత్తుపదార్థాలను  థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. ఇలాంటి డ్రగ్స్ ని యాబా డ్రగ్‌గా పిలుస్తారని సీపీ మహైష్ భగవత్ వివరించారు.