ఆదిలాబాద్ పట్టణంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి 11మందిని అరెస్ట్ చేశారు. గురువారం టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణతో కలిసి పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై సంయుక్తంగా దాడి చేశారు. 

నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. కైలాస్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఎస్‌.రామకృష్ణ తెలిపారు.

గత కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నట్లు వివరించారు.

ఇందులో వడ్డెర కాలనీకి చెందిన షేక్‌ ఆసిఫ్, శాంతినగర్‌కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్‌ మండలం పెండల్‌వాడకు చెందిన ఠాకూర్‌ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్‌బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్‌కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్‌ మండలం పెడల్‌వాడకు చెందిన చుక్కలవార్‌ ఆకాశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

వీరి నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు నిర్వాహకులతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వన్‌టౌన్‌ ఎస్సైలు జి.అప్పారావు, జాదవ్‌ గుణవంత్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అధికారులు షేక్‌ తాజొద్దీన్, ఎం.రమేష్‌కుమార్, సయ్యద్‌ రాహత్, హనుమంత్‌రావు, ఎంఏ కరీమ్, మంగళ్‌సింగ్, ఠాకూర్‌ జగన్‌సింగ్, ఎన్‌.నగేష్, మహిళ కానిస్టేబుళ్లు మమత, సోనీ తదితరులు ఉన్నారు.