విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత... తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో.... టీచర్స్ మీద కూడా అంతే ఉంటుంది. అలాంటి ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు...  నాలెడ్జ్ అవసరం అంటూ... విద్యార్థులకు పోర్న్ చిత్రాలు చూపించాడు. కేవలం విద్యార్థినులనే టార్గెట్ చేసి వారికి ఆ వీడియోలు చూపించడం.. ఆ తర్వాత అసభ్యంగా అమ్మాయిలను తాకుతూ వారిని హింసించడం లాంటివి చేసేవాడు. అయితే... ఈ విషయం చివరకు పోలీసులకు తెలియడంతో.... అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంగటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....షాద్ నగర్  పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. సైన్స్ లో భాగంగా శృంగారం గురించి కచ్చితంగా తెలుసుకోవాలంటూ తన స్మార్ట్ ఫోన్ లోని అసభ్యకర వీడియోలు, ఫోటోలను విద్యార్థినులకు చూపించేవాడు. వాటి గురించి వివరంగా వాళ్లకు చెబుతూ... వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

అయితే... మహిళలు, చిన్నారుల భద్రతకు సైబరాబాద్‌ పోలీసులు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కమిషనరేట్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో బాలమిత్రలను ఏర్పాటు చేశారు. బడిలో లైంగిక వేధింపులకు గురవుతున్న బాలికలకు భద్రత కల్పించడానికి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి స్కూల్లో కొంతమంది టీచర్స్‌ను ఎంపిక చేసి వారిని పోలీసులకు వారధిగా, చిన్నారులకు భరోసా కల్పించే మిత్రలుగా నియమించారు. 

షీటీమ్స్‌ ఆధ్వర్యంలో ‘వాటీజ్‌ బ్యాడ్‌ టచ్‌ వాటీజ్‌ గుడ్‌ టచ్‌’ అనే అంశాలు, లైంగిక వేధింపులపై అవగాహన కల్పిస్తారు. దాంతో ఎంతోమంది చిన్నారులు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను బాలమిత్రలకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కూల్లో సైన్స్‌ ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని విద్యార్థినులు స్కూల్లోని బాలమిత్ర దృష్టికి తీసుకెళ్లారు. 

బాలమిత్ర ద్వారా సమాచారం అందుకున్న షీటీమ్స్‌ స్కూల్లో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.