హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో కీలకంగా పరిగణిస్తోన్న ఇన్నోవా కారును పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లని, ఇద్దరు మేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచార (amnesia pub rape case) ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితులుగా ఆరోపణలుగా ఎదుర్కొంటున్న వారిలో పలువురు ప్రజా ప్రతినిధుల కుమారులు, బంధువులు వుండటం.. పైగా మైనర్లు కావడంతో పోలీసులు ముందుకు సాగలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు సైతం పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లని, ఇద్దరు మేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కోర్టు ఎదుట హాజరు పరచగా.. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. 

కాగా.. ఈ దారుణానికి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఈ కారును పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అత్యాచారం ఇందులోనే జరగడంతో కేసు దర్యాప్తులో ఇన్నోవా కీలకంగా మారింది. అయితే ఈ కారు ఎవరదనే విషయంపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. 

అటు ఈ కేసులో ఎక్సైజ్ శాఖ (telangana excise department) రంగంలోకి దిగింది. మైనర్లను పబ్‌లలోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వారిని ఎలా అనుమతించారని అధికారులు పబ్ యజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఓ కార్పోరేట్ స్కూల్ పేరుతో ఉస్మాన్ అనే విద్యార్ధి ఫేర్‌వెల్ పార్టీకి అనుమతి తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 150 మంది విద్యార్ధుల కోసం పబ్ బుక్ చేసి.. ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించారు. అయితే తాము ఎవరికీ మద్యం సరఫరా చేయలేదని... కూల్‌డ్రింక్‌లు మాత్రమే ఇచ్చినట్లు పబ్ నిర్వాహకులు చెబుతున్నారు. 

Also Read:Amnesia Pub Rape Case : ఫోటోలు, వీడియోలు లీక్.. అలర్టైన పోలీసు ఉన్నతాధికారులు, అత్యవసర భేటీ

అంతకుముందు .. అమ్నేషియా పబ్‌ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియా‌ను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు నిందితులు వైపా..?, బాధితుల వైపా..? అని ప్రశ్నించారు. పోలీసులకు ధైర్యం ఉంటే.. తప్పుచేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తి కాకముందే కొందరికి క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారని ప్రశ్నించారు. నిర్బయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్నవారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. 

పోలీసులు అవసరమైతే టీఆర్ఎస్‌ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ.. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరని అన్నారు. ఎంఐఎం‌ వాళ్లను కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కలర్ మెర్సిడెజ్ కారులో ఉన్న వ్యక్తులను నిందితులుగా చేర్చకుండా.. వెనకాల ఇన్నోవాలో ఉన్నవారిని నిందితులుగా చేర్చడం బాధకరమని అన్నారు. ఇన్నోవా కారులో ఉన్నవారిని ముద్దాయిలుగా చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరతామని అన్నారు. 

అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడుకు బాలికపై అత్యాచారం చేశాడని చెప్పారు. కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. కానీ లిమిటేషన్ దృష్ట్యా ప్రపంచానికి ఎంతవరకు చూపించాలో తనకు తెలుసని అన్నారు. కొన్ని ఫొటోలను రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే అమ్మాయి ఫొటో కనిపించకుండా ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు. 

హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని చెప్పారు. ‘‘అమ్మాయి కన్సెంట్ ఇచ్చిందని అనవచ్చు.. ఒకవేళ కన్సెంట్ ఇచ్చిన మైనర్ కన్సెంట్ వ్యాలిడ్ అవుతుందా..?’’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.