హైదరాబాద్ నగరంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఇతర రాష్ట్రాల నుంచి  అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచార కూపంలో దింపేశారు. కాగా.. ఆ ముఠాలను తాజాగా రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన వైనాల భిక్షపతి, ప్రకాశం జిల్లాకు చెందిన సత్యనారాయణలు స్నేహితులు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు బ్రోతల్‌ హౌస్‌ నిర్వహించాలని పథకం వేశారు. నేరేడ్‌మెట్‌లోని ఆఫీసర్స్‌ కాలనీలో పోర్షన్‌ అద్దెకు తీసుకున్నారు. భిక్షపతి తనకు పరిచయం ఉన్న ఏజెంట్లను సంప్రదించేవాడు. 

హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే నెపంతో పశ్చిమబెంగాల్‌ నుంచి అమ్మాయిలను నగరానికి రప్పించేవాడు. సత్యనారాయణ వారి చేత వ్యభిచారం చేయించాడు. ఇలా నగరానికి వచ్చిన అమ్మాయిలకు తక్కువ మొత్తంలో చెల్లించి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించేవారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటి నేరస్థులను కఠినంగా శిక్షించాలని సీపీ మహేష్‌ భగవత్‌ వారిపై పీడీయాక్టు నమోదు చేసినట్లు తెలిపారు.