డబ్బున్నవారే ఆమె టార్గెట్. సమాజంలో మంచి డబ్బు, పలుకుబడి ఉన్నవారికి వలపు వలస విసిరేది. వాళ్లు.. ఆమె బుట్టలో పడ్డారా.. ఇక అంతే. వాళ్లతో కలిసి గడిపేది. ఆ తర్వాత వాళ్లని తన చుట్టూ తిప్పుకునేలా చేసేది. అక్కడితో ఆగేది కాదు.. వాళ్లు తనతో ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజేది. చివరకు ఆ కిలాడీ లేడి పోలీసులకు చిక్కింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  పాల్వంచ పట్టణానానికి చెందిన ఓ మహిళ.. పురుషులకు వలపు వల విసిరి డబ్బు సంపాదించేది. కాగా.. ఇటీవల ఆమె ఇటీవల శాస్త్రిరోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో లొంగదీసుకుంది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడపడం గమనార్హం. 

దీంతో సదరు వ్యాపారి అంతమొత్తం ఇచ్చుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని రప్పించి మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అనంతరం ఆమె ఫోన్‌ డాటా, ఫోన్‌లో ఉన్న చిత్రాలను పరిశీలించగా.. మరికొందరు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నారనే విషయం వెలుగు చూసినట్లు సమాచారం. కేటీపీఎస్‌ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో పడ్డట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారు. ఏ స్థాయిలో డబ్బులు కాజేశారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు ఓ అంగన్‌ వాడీ సెంటర్‌కు చెందిన మహిళ సహకారం కూడా ఉన్నట్లు సమాచారం.