హైదరాబాద్: యాచకురాలిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులోఇద్దరు నిందితులపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. హైదరాబాదులోని బాలానగర్‌కు చెందిన కొండవీటి సాయికిరణ్, జీడిమెట్ల చింతల్‌లో ఉంటున్న మెదక్‌ జిల్లావాసి గజ్జగల్లా రాజు ఆ దురాగతానికి పాల్పడ్డారు. 

వారు నిరుడు ఏప్రిల్‌ 9న అర్ధరాత్రి సమయంలో బలానగర్‌ హనుమాన్‌ మందిర్‌కు సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో మద్యం తాగి గంజాయి సేవించారు. అదే సమయంలో అక్కడ గుడిసెలో యాచకురాలు బోయిన లక్ష్మమ్మ(35), ఆమె తల్లి దుర్గమ్మ(75) నిద్రపోతున్న విషయాన్ని గమనించారు.

వృద్ధురాలైన దుర్గమ్మను బెదిరించి లక్ష్మమ్మను తమ వెంట తెచ్చుకున్న గమ్‌ టేప్‌తో చేతులు వెనక్కి కట్టేసి అరవకుండా నోటికి  గమ్‌టేప్‌ వేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ముఖం, ముక్కుకు గమ్‌టేప్‌ ఉండటంతో శ్వాస అడక ఆమె మరణించింది.

మరణించిన తర్వాత కూడా ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను ఐడీపీఎల్‌వాసి బెంగళూరు ఎయిర్‌ఫోర్స్‌ రిటైర్డ్‌ సిపాయి బాలా నర్సింగ్‌రావు ప్రత్యక్షంగా చూశాడు. వారిద్దరు వెళ్లిపోయిన అనంతరం అతను కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదుచేసిన బాలానగర్‌ పోలీసులు నిరుడు ఏప్రిల్‌ 23న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు