హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకలకు నగరవాసులు సిద్ధమౌతున్నారు. ఈ వేడుకలను ఆసరాగా చేసుకొని డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. యువతకు గాలం వేసి.. వారి చేత గంజాయి, డ్రగ్స్ కొనేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది యువతీయువకులు వీటి కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. దీనిని అదునుగా చేసుకొని స్మగ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

కాగా.. వీరి ఆటలకు హైదరాబాద్ రాచకొండ పోలీసులు కొంత మేర అడ్డుకట్ట వేశారు. నగరం నుంచి గోవాకు గంజాయి.. గోవా నుంచి డ్రగ్స్ నగరానికి తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు  చేశారు.

కెన్యాకి చెందిన మ్వాండేజేజిల్లాని రేమాండ్‌(26) అనే యువకుడు 2013లో స్టూడెంట్‌ వీసాపై నగరానికి వచ్చాడు. నేరేడ్‌మెట్‌లో ఉంటూ బీకామ్‌ పూర్తి చేశాడు. అనంతరం ఎంబీఏలో చేరాడు. ఈ క్రమంలో స్టూడెంట్‌ వీసాపై వచ్చి రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉంటున్న నైజీరియన్‌ యువకుడు సామ్‌ పరిచయం అయ్యాడు. అప్పటికే సామ్‌కు అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయి. ఆ విధంగా రేమాండ్‌ సైతం సామ్‌తో పాటు గోవా తదితర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెచ్చి కళాశాల యువతకు సరఫరా చేస్తున్నాడు.

కాగా..  కెన్యా యువకుడితో సహా మరో ఇద్దరిని  పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 4కిలోల గంజాయి, 10గ్రాముల కొకైన్, 125 ప్యాకెట్ల వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. ఈ డ్రగ్స్ ని యువతకు అమ్మడానికి ప్లాన్ వేసినట్లు వారు విచారణలో అంగీకరించారు.