హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 15 రోజులుగా హైదరాబాదులో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు కొనుగోలు చేసినట్లు కనిపెట్టారు. దాదాపు 300 మంది వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, విద్యార్థులు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అమిత్, పరమ్ అరెస్టుతో ఆ చిట్టా బయటపడింది.

అధికారులు 300 మంది జాబితాను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరమ్, అమిత్ అనే ఇద్దరి అరెస్టుతో డ్రగ్స్ వ్యవహారం తాజాగా డ్రగ్స్ కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో డ్రగ్స్ విక్రయాలు జరిపినవారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. 

అమిత్, పరమ్ తమ వాట్సప్ డేటాలను, మొబైల్ డేటాలను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే, వాట్పప్ చాట్స్ డేటాను రిట్రీవ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  లాక్ డౌన్ 3.0 సడలింపు నేపథ్యంలో డ్రగ్స్ అక్రమ విక్రయాలు, కొనుగోళ్లు పెరిగినట్లు భావిస్తున్నారు. కొంత మంది బెంగళూరు మైక్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి.

హైదరాబాదులో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికారులు పలువురు సినీ ప్రముఖులను విచారించారు. మరోసారి డ్రగ్స్ వ్యవహారం ముందుకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎవరికి చుట్టుకుంటుందో అనే భయాందోళనలు చోటు చేసుకున్నాయి.