హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం బిజెపి పలు మున్సిపాల్టీ లకు ఛైర్మెన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో ఆయా మున్సిపాలిటీల పై కమలనాథులు ప్రత్యేకంగా దృష్టి పెట్టా పెట్టామని చెప్పకనే చెప్పినట్లయింది.రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీ లకు జరుగుతున్న ఎన్నికల్లో 15 మున్సిపల్ స్థానాల్లో ఛైర్మెన్ అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. 

పోటీ తీవ్రంగా ఉన్న టిఆర్ ఎస్ గాని, ప్రధాన ప్రతిపక్షం గా భావిస్తున్న కాంగ్రెస్ గానీ చైర్మెన్ అభ్యర్థులను ఎక్కడా ముందుగానే ఖరారు చేయకపోయినా బిజెపి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం వెనుక వ్యూహం  ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా ఆ మునిసిపాలిటీల్లో విజయం సాధించాలని అభ్యర్థులను ప్రకటించిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అన్న చర్చ అటు పార్టీలో ఇతు రాజకీయ వర్గాల్లో మొదలైంది. 

చైర్మెన్ అభ్యర్థులను ప్రకటించినా  ఆ మున్సిపాలిటీ ల్లో  అనుకున్న ఫలితాలు సాధించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీ లో నిన్న మొన్నటి వరకూ కొనసాగిన ఒకరిద్దరు నేతల పేర్లు చైర్మన్ల జాబితాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం పార్టీలో కూడా దుమారం రేపింది. 

బిజెపికి ఎంపీలు ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం కమలనాథులు ప్రత్యేకంగా విజయం కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎంపీలు పూర్తిస్థాయిలో బాధ్యతలు పావులు కదుపుతున్నారు.చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన మునిసిపాలిటీల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని మున్సిపాలిటీలు లేకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది.

విజయం సాధించే అవకాశాలు ఉన్న మునిసిపాలిటీల్లో చైర్మెన్లను ఎందుకు ప్రకటించ లేదన్న వాదన తెరపైకి వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, జిల్లాలతో పాటు నగర శివారు ప్రాంతాలకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను కమలనాథులు ప్రకటించడం తో చైర్మన్ అభ్యర్థులే స్థానికంగా ఎన్నికల బాధ్యత వహించాలన్న సంకేతాలు ఇచ్చినట్లు అయిందన్న వాదన కూడా ఉంది.

మొత్తం మీద  కొన్నిమున్సిపాలిటీ లకు ఛైర్మెన్ అభ్యర్థులను ప్రకటించడం కమలనాథులకు కలిసొస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి