స్నేహం పేరుతో మాట కలిపి.. నమ్మిన అమ్మాయిని మోసం చేశాడో యువకుడు. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ యువతికి తొమ్మిదేళ్ల స్నేహితుని ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.

మూడేళ్ల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. కొద్దిరోజులు ఫోన్‌లో సాగిన వీరి స్నేహం.. తర్వాత బయట షికార్ల వరకు వెళ్లింది. ఓ రోజు ఇలాగే ఆమెను బయటకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు.

దానిని సేవించిన యువతి స్పృహ తప్పడంతో ఆమెను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు తీసివేసి నగ్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోల్ని యువతికి చూపించాడు.

ఇది చూసిన ఆమె ఖంగుతింది... తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె వాటిని తొలగించాలని ప్రాధేయపడింది. ముందు వాటిని తొలగించానని ఆమెను నమ్మించిన యువకుడు అనంతరం వాటిని నీలిచిత్రాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు.

అయితే సదరు యువతి స్నేహితురాలు వాటిని చూసి విషయం ఆమెకు చెప్పడంతో యువకుడి మోసం వెలుగుచూసింది. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ అధారంగా అమెరికాలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి భారత్‌కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు.