పానీపూరీ ఇప్పిస్తానని ఆశ చూపించి ఓ వ్యక్తి.... 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బీకేగూడ ప్రాంతంలోని ఓ బస్తీలో దంపతులు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్నకుమార్తె గురువారం మధ్యాహ్నం నుంచి సడెన్ గా కనిపించలేదు. దీంతో.. బాలిక తల్లి చిన్నారి కోసం చుట్టుపక్కల గాలించింది.

అక్కడ ఓ సెక్యురిటీ కనిపించి.. బాలికను ఓ వ్యక్తి అటువైపు తీసుకువెళ్లానని చెప్పడంతో... బాలిక కోసం వెతకడం ప్రారంభించింది. కాగా సాయంత్రానికి బాలిక ఈఎస్ఐ సమీపంలో నాగరాజు అనే వ్యక్తితో కనిపించింది. బాలికను పక్కనే కూర్చోపెట్టుకొని అతను మద్యం తాగుతూ కనిపించాడు. వెంటనే కుమార్తె వద్దకు సదరు మహిళ పరుగులు తీసింది.

ఏం జరిగిందని కూతురిని ఆరా తీయగా... సమోసా, పానీపూరీ ఇప్పిస్తానని చెప్పి.. తనను బాత్రూమ్ కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో బాలిక తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడు నాగరాజు(30)ని పట్టుకొని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

కాగా.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ జరింపించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్చుతరావు డిమాండ్ చేశారు.