హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు , రూ. 25 వేల జరిమానాను విధిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం నాడు తీర్పు చెప్పింది.2020 డిసెంబర్ మాసంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై చెన్నయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.  చెన్నయ్య వయస్సు 50 ఏళ్లు. బొమ్మలు ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. ఒడిశాకు చెందిన దంపతులు ఉపాధి కోసం హైద్రాబాద్ కు వలస వచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిని ఇంట్లోనే వదిలి భార్యాభర్తలు కూలీ పనికి వెళ్తుంటారు. భార్య ఇళ్లలో పనులు చేస్తుండేది.

ఉదయాన్నే పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి  బాలిక  పక్కింటి నుండి  రావడం కన్పించింది. బొమ్మలు ఇస్తానంటే ఆ ఇంటికి వెళ్లినట్టుగా బాలిక చెప్పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి చిన్నారి నొప్పితో బాధపడుతుండడం కన్పించింది. బొమ్మలు ఇచ్చి తాతయ్య తలుపులు వేశాడని  తల్లికి ఆ చిన్నారి చెప్పింది. ఈ విషయమై అతడిని ప్రశ్నించేందుకు వెళ్లగా అతడు పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  చెన్నయ్యను వెతికి పట్టుకొన్నారు. దీనిపై  ఇవాళ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.