ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు: హైద్రాబాద్‌కి చెందిన మహమ్మద్ ఖాజా సూసైడ్
ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. హైద్రాబాద్ జవహర్ నగర్ సాయి గణేష్ కాలనీకి చెందిన మహహ్మద్ ఖాజా సూసైడ్ చేసుకొన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: online Loan App యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. Hyderabad నగరంలోని జవహర్ నగర్ సాయి గణేష్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మహమ్మద్ Khaja అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
లోన్ డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకుల నుండి ఇటీవల కాాలంలో వేధింపులు ఎక్కువైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వేధింపులు భరించలేక Suicide కి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు అప్పులు చెల్లించాలని కోరుతూ పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి. మంచిర్యాల జిల్లాలో వేధింపులకు పాల్పడడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ఏడాది మే 16న చోటు చేసుకుంది.
కళ్యాణి అనే మహిళ రూ.30 వేలు లోన్ తీసుకుంది. లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో కళ్యాణిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపారు లోన్ యాప్ నిర్వాహకులు. ఈ అవమానాన్ని భరించలేక మనస్తాపంతో కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రూ. 12 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే లోన్ సమయంలో రిఫరెన్స్‌గా స్నేహితుల ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. తీసుకున్న రుణానికి సంబంధించి.. ఈఎంఐ ద్వారా 4 నెలలు చెల్లింపులు చేశాడు. మిగిలిన నగదు చెల్లించకపోవడంతో రాజ్‌కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 19న జరిగింది.
ఈ ఏడాది జనవరి 30న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన సింగటి రమేష్ హైద్రాబాద్ లోని ఉప్పల్ లో ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. తనతో పాటు ఇతర మిత్రులు కూడా అదే రూమ్ లో ఉంటున్నారు. రమేష్ ఆన్ లైన్ లో గణితం బోధిస్తున్నాడు. అవసరం కోసం రమేష్ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.5 వేలు అప్పుగా తీసుకొన్నాడు. అయితే సకాలంలో రమేష్ ఈ అప్పును చెల్లించలేదు. దీంతో రమేష్ బంధు మిత్రులకు యాప్ నిర్వాహకులు ఈ విషయమై మేసేజ్ పెట్టారు. ఈ అప్పును చెల్లించాలని రమేష్ ను పదే పదే వేధింపులకు గురి చేశారు. ఈ వేధింపులు భరించలేక రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో మిత్రులు ఎవరూ లేని సమయంలో రమేష్ ఫ్యాన్ కు ఉరేసుకొన్నాడు.
రమేష్ మిత్రులు ఇంటికి వచ్చిన చూసే సరికి లోపలి నుండి గడియ వేసి ఉంది. మరో గది నుండి లోపలికి వెళ్లి చూడగా రమేష్ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించాడు. వెంటనే అతడిని కిందకి దించారు. కానీ రమేష్ అప్పటికే మరణించాడు.ఈ విషయమై స్నేహితులు రమేష్ పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. రమేష్ కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.