రాజకీయమంతా కల్లు కాంపౌండ్లలోనే.. చిచ్చా రచ్చ రచ్చ చేసిండు: కేటీఆర్

KTR speech at gouda atmiya sabha
Highlights

ఎవరి పాలన ఎలా జరుగుతుందో.. రాష్ట్రంలో, గ్రామంలో ఏం జరుగుతుందో ఇలాంటి రాజకీయ చర్చలన్నీ కల్లు కాంపౌండ్లలోనే జరుగుతాయన్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ గ్రామంలోని ఎక్సైజ్ అకాడమీలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఎవరి పాలన ఎలా జరుగుతుందో.. రాష్ట్రంలో, గ్రామంలో ఏం జరుగుతుందో ఇలాంటి రాజకీయ చర్చలన్నీ కల్లు కాంపౌండ్లలోనే జరుగుతాయన్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ గ్రామంలోని ఎక్సైజ్ అకాడమీలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని.. ఇప్పటి వరకు ఇక్కడ 2 వేల ఈత మొక్కలు నాటామన్నారు. అలాగే హైదరాబాద్‌లో నీరా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి గౌడ వ్యాపారాన్ని పెంచుతామన్నారు. నేను ఇక్కడికి రాగానే ఒక గ్లాస్  నీరా ఇచ్చారని...  తాగితే చాలా బాగుందని కేటీఆర్ అన్నారు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. ‘‘ గౌడ్లు.. మన కులవృత్తిని మానేయండి.. నేను కూడా కల్లు దుకాణం నడిపిన వాడినే.. ఒకప్పుడు కల్లు దుకాణాలు బాగానే ఉండేవి.. అయితే ఎవరి దిష్టి  తగిలిందో కానీ కల్లు గీత కార్మీకుల దుకాణాలు నాశనమయ్యాయి. తెలంగాణ వచ్చాకా కేసీఆర్‌తో కలిసి దుకాణాలను మళ్లీ తెరిపించినా ఫలితం లేదు.. రోజూ లీటర్ల  కొద్ది కల్లును డ్రైనేజీలో పారబోస్తున్నామని పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలోనే ఇలా ఉంటే.. గ్రామాల్లో పరిస్థితి  ఇంకా దారుణంగా ఉందని... గౌడ్ ఈత చెట్ల వద్దకు వెళితే తిరిగొస్తాడో.. రాడో తెలియదు.. కల్లు తీసేటప్పుడు ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోతే చెల్లించే పరిహారాన్ని మన ముఖ్యమంత్రి రూ.5 లక్షలు చేశారని తెలిపారు.. ప్రాణాలు పణంగా పెట్టి ఈ వృత్తిని కొనసాగించాల్సిన అవసరం లేదని... మన కులవృత్తిని మానేయాలని మంత్రి గౌడ్లకు పిలుపునిచ్చారు.

మధ్యలో కల్పించుకున్న కేటీఆర్ చిచ్చా( పద్మారావు) రచ్చ రచ్చ చేసిండు.. ఈ  పేపరోళ్లు ఏం రాస్తారో ఏమో.. రేపు పేపర్లు చూడాల్సిందేనంటూ చెప్పేసరికి  అక్కడున్న వారు నవ్వులు చిందించారు. ఇక పద్మారావు గారిని ఎందుకు చిచ్చా అంటున్నా అంటే.. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో కరీంనగర్‌ ఎంపీగా కేసీఆర్ బరిలో నిలిచారు.. ఆ సమయంలో పద్మారావు గారితో  కలిసి పనిచేశా... అప్పుడు అక్కడున్న వెలమలు టి.పద్మారావు అంటే వెలమ అనుకుని ... తనతో మీ చిచ్చానా అని అడిగారు.. అప్పుడు అవును అన్నాను.

ఆ క్షణం నుంచి ఆయన నాకు చిచ్చా అయిపోయిండు. గౌడ కులస్తులకు గత ప్రభుత్వాల కంటే చాలా చేశామని.. అనేక రాయితీలు, అవకాశాలు కల్పించాం. అవసరమైతే నగరంలో నీరా కేంద్రాలు పెడతామని.. కల్లు గీత కార్మికుల బిడ్డలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వాలని అందుకు తాను మద్ధతుగా ఉంటానని  కేటీఆర్ అన్నారు.

loader