మన దేశంలో బెంగళూరును స్టార్టప్ హబ్‌గా పిలుచుకుంటారు. సిలికన్ వ్యాలీ అని కూడా దానికి పేరు ఉన్నది. కానీ, ఇక్కడ రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయని, ప్రతి రోజూ విద్యుత్ కోతలు పెడుతున్నారని కొందరు స్టార్టప్ ఫౌండర్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నుంచి అనూహ్య ఆహ్వానం వెళ్లింది. అలాగైతే.. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్‌కు తరలి రండి అని పేర్కొన్నారు. 

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలే స్టార్టప్ ఫౌండర్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. సిలికన్ వ్యాలీగా పిలుస్తున్న బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, విద్యుత్ కోతలూ ఉన్నాయని డిజిటల్ బుక్ కీపింగ్ స్టార్టప్ ఖాతాబుక్ ఫౌండర్, సీఈవో రవీష్ నరేష్ మార్చి 30న ట్వీట్ చేశారు. దీనికి అనూహ్యంగా తెలంగాణ మంత్రి నుంచి స్పందన వచ్చింది. మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి. ఇక్కడ మేం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆఫర్ చేశారు.

ఖాతాబుక్ వ్యవస్థాపకుడు, సీఈవో తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ (దీన్నే భారత సిలికన్ వ్యాలీగా గుర్తిస్తుంటారు)లోని స్టార్టప్‌లు బిలియన్ డాలర్లను పన్నుల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయని, కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజు విద్యుత్ కోతలూ ఉన్నాయని వివరించారు. స్వచ్ఛమై మంచి నీరు లేదని, నడవడానికి వీలు లేని విధంగా ఫుట్ పాత్‌లు ఉన్నాయని ఆయన సమస్యలను ఏకరువు పెట్టారు. భారత్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాలు ఇక్కడి సిలికన్ వ్యాలీ కంటే మెరుగ్గా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇక్కడి నుంచి సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లాలంటే పీక్ ట్రాఫిక్ టైంలో మూడు గంటలు పడుతుందని తెలిపారు.

మరో స్టార్టప్ సేతు ఏపీఐ ఫౌండర్ నిఖిల్ కుమార్ కూడా రవీష్ నరేష్‌తో ఏకీభవించారు. ఆ ఆరోపణలు నిజం అంటూ పేర్కొన్నారు. బెంగళూరు ఎంత అధ్వాన్నంగా మారిపోయిందో అని ఆవేదన చెందారు. దయచేసి ఇక్కడి పరిస్థితులను గమనించి చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. వెంటనే చర్యలకు ఉపక్రమించకపోతే ఇక్కడి నుంచి సామూహికంగా వలసలు తథ్యం అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఈ సంభాషణలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాయిన్ అయ్యారు. అందుకే ‘మీ బ్యాగులు ప్యాక్ చేసుకోండి. హైదాబాద్‌కు తరలి రండి’ అని ట్వీట్ చేశారు. తమ దగ్గర మంచి మౌలిక సదుపాయాలు, అదే స్థాయిలో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. తమ ఎయిర్ పోర్టు ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటి అని వివరించారు. సిటీలోకి వెళ్లడం, బయటకు రావడం కూడా ఎలాంటి ప్రయాస లేకుండా చాలా సులభంగా ఉంటుందని తెలిపారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తమ ప్రభుత్వం మూడు ఐ మంత్రాలను పాటిస్తుందని వివరించారు. ఒకటి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

భారత్‌లోని స్టార్టప్ హబ్‌గా బెంగళూరుకు పేరున్నది. 2019-21 కాలంలో ఇక్కడే 34 శాతం స్టార్టప్ ఆఫీసులు (లీజింగ్ షేర్) ఉన్నాయి.