తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  డ్రగ్స్ కు వ్యతిరేకంగా దిల్ షుక్ నగర్ లో జరిపిన ర్యాలీలో కోదండరాం పాల్గొని మాట్లాడారు. గతంలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో  హాస్టల్ లో తన రూమ్మెట్ కూడా డ్రగ్స్ కు బానిసైండని చెప్పారు. ఆయన ఆ అలవాటు నుండి బయట పడేందుకు తాను, తన స్నేహితులందరూ సహాయం చేశామన్నారు. అలా సహాయం చేస్తే అనేక సంవత్సరాల తర్వాత తన రూమ్మెట్ డ్రగ్స్ అలవాటును మానుకున్నాడని చెప్పారు. ఒక్కసారి డ్రగ్స్ మనకు అలవాటైతే జీవితాలు నాశనమే తప్ప ఇంకో పరిష్కారం దొరకదని చెప్పారు కోదండరాం. తన సహచర విద్యార్థులు గొప్ప గొప్ప ఫ్రొఫెసర్లు కావాల్సిన వారు డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకున్నారని, చాలా మంది వైవాహిక జీవితానికి కూడా నోచుకోలేకపోయారని చెప్పారు.

తెలంగాణ సర్కారు కేవలం విచారణలతోనే ఆగిపోకుండా డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోదండరాం సూచించారు. వ్యాపారంలో ఎవరున్నప్పటికీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేటి యువత డ్రగ్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోదండరాం సూచించారు. నేటి యువత ప్రతి ఒక్కరూ డ్రగ్స్ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఉడ్తా పంజాబ్ సినిమా చూడాలని సూచించారు. ఆ సినిమా చూస్తే డ్రగ్స్ తీసుకుంటె ఏంజరుగుద్దో తెలుస్తుందన్నారు. పంజాబ్ లో నేడు డ్రగ్స్ ప్రమాదకరంగా మారిందన్నారు. ఇప్పుడు పంజాబ్ డ్రగ్స్ ఛాయలు  హైదరాబాద్ లొ కన్పిస్తున్నాయన్నారు. డ్రగ్ వ్యాపారాన్ని అరికట్టే సత్తా ప్రభుత్వానికే ఉందన్నారు కోదండరాం.