తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఉన్న బలమైన నాయకుల జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. 20 ఏండ్ల పాటు నల్లగొండ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కోమటిరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. దీంతో నల్లగొండ నియోజకవర్గంతోపాటు జిల్లాలోనూ బలమైన కేడర్ కలిగి ఉన్నారు. అంతేకాదు తెలంగాణలో మిగతా జిల్లాల్లోనూ కోమటిరెడ్డికి ఫాలోయర్లు, అభిమానులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా మారుతాడన్న అంచనాల్లో అధికార పార్టీ ఉన్నది. అందుకే ఎలాగైనా కోమటిరెడ్డిని చదరంగంలో రాజును బంధించినట్లుగా ఫిక్స్ చేయాలని తలంచింది. అందుకోసమే సభ్యత్వ రద్దు క్రీడకు సర్కారు పూనుకుందన్న చర్చ మొదలైంది. మరి కోమటిరెడ్డిది పైచేయి అవుతుందా? లేక అధికార పార్టీ చతురంగ బలగాలు పైచేయి సాధిస్తాయా? ఇకపై తెలంగాణలో కేసిఆర్ వర్సెస్ కోమటిరెడ్డి వార్ నువ్వా నేనా అన్నట్లు సాగనుందా? ఈ చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.

కోమటిరెడ్డి చేసిన నేరమేమీ కొత్తది కాదు. గవర్నర్ నరసింహన్ ను టార్గెట్ చేసి హెడ్ ఫోన్లు విసిరేశిండు. అది గవర్నర్ కు తాక గూడ తాకలేదు. కానీ.. ఉత్త పుణ్యానికే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని తెలంగాణ సర్కారు రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ సంఘటనలో ఏమాత్రం ప్రమేయం లేని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ సభ్యత్వ రద్దు మరీ దారుణంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. కానీ కోమటిరెడ్డితోపాటు సంపత్ మీద కూడా వేటు వేశారు. ఈ పరిస్థితుల్లో వేటు వేసిన తర్వాత టిఆర్ఎస్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది. వెంటనే గెజిట్ వెలువరించడం.. ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమిషన్ కు వర్తమానం పంపడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో ఇవాళ కాకపోయినా రేపైనా ఆ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమే అని అధికార పార్టీ చెబుతోంది. హైకోర్టు ఆరు వారాల పాటు ఎన్నికల ప్రాసెస్ షురూ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంటే మే నెల తర్వాత నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు తప్పేలా లేదు. ఒకవేళ హైకోర్టు మరికొంత కాలం ఉప ఎన్నికలపై స్టే ఇస్తే తప్ప ఈ ఉప ఎన్నికలను ఆపే పరిస్థితి లేదని సర్కారు చెబుతున్నది. అవసరమైతే కర్ణాటక ఎన్నికలతోపాటే ఈ ఉప ఎన్నికలు కూడా వస్తాయని మంత్రి హరీష్ రావు ఇప్పటికే జోస్యం చెప్పారు. దీనికోసం ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే స్పీడ్ గానే అధికార టిఆర్ఎస్ పార్టీ కసరత్తు షురూ చేసింది.  

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డిని ఎదుర్కోవాలంటే ముందుగా ఒక ఉప ఎన్నిక తీసుకొచ్చి... కోమటిరెడ్డికి వత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో సిఎం కేసిఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. 2018లోనే నల్లగొండ అసెంబ్లీకి ఎన్నిక వస్తే.. కోమటిరెడ్డి శక్తులు, వనరులన్నీ ఖాళీ చేయించవచ్చన్నది కేసిఆర్ ఎత్తుగడగా చెబుతున్నారు. ఒకవేళ రేపు జరగనున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి సానుభూతి, ఇతర కారణాలతో భారీ మెజార్టీతో గెలిచే చాన్స్ ఉన్నా.. 2019 జనరల్ ఎన్నికల్లో ఆయనను మెసలకుండా చేయాలన్న ప్లాన్ లో అధికార పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం సీరియస్ గానే పనిచేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఎంతవరకైనా సరే కేసిఆర్ ను గద్దె దించుతా.. గజ్వెల్ లో పోటీ చేసి కేసిఆర్ ను ఓడిస్తా అని పలుమార్లు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాళ్ల నేపథ్యంలో కేసిఆర్ పక్కా స్కెచ్ ప్రకారమే కోమటిరెడ్డి సభ్యత్వ రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లోనే కోమటిరెడ్డిని అన్ని విధాలుగా బలహీనం చేయడం ఒక ఎత్తైతే.. రానున్న ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు నుంచి కేసిఆర్ పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక ఒక ఉప ఎన్నిక తేవడం ద్వారా కోమటిరెడ్డిని బలహీనపరచి వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి ఎంపిగా నిలబడినా.. ఆయనను సునాయాసంగా ఎదుర్కోవచ్చన్నది అధికార పార్టీ స్కెచ్ గా చెబుతున్నారు.

అలా కాకుండా డైరెక్ట్ 2019 ఎన్నికలకు రెడీ అయితే అప్పుడు నల్లగొండలో ఎంపి సీటుకు ఇటు కోమటిరెడ్డి, అటు కేసిఆర్ ఇద్దరూ బరిలోకి దిగితే కేసిఆర్ కు ఇరకాటంలో పడే చాన్స్ ఉందని అంచనాల్లో ఉన్నారు. దానికోసమే ముందుగాల ఒక చిన్న దెబ్బ కొట్టి తర్వాత పెద్ద దెబ్బ కొట్టేందుకే ఈ స్కెచ్ వేశారన్న ప్రచారం అధికార పార్టీలో సాగుతోంది. మరి అధికార పార్టీ ఈ ఎత్తుగడను కోమటిరెడ్డి ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.