హైదరాబాద్: తన కూతురు, మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపించే ఆలోచనను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మార్చిలో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. 

తన కూతురు కవితను రాజ్యసభకు పంపించాలని తొలుత కేసీఆర్ భావించారు. అయితే, తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఓమటి పాలైన తన కూతురును దొడడిదారిన రాజ్యసభకు పంపించారనే విమర్శలను ఎదుర్కోవడం ఇష్టం లేక ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు మరో రూపంలో స్థానాలను కట్టబెడితే ఒత్తిడి పెరుగుతుందనే భావన కూడా ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి ఓటమి పాలైన తర్వాత కవిత దాదాపుగా ఏమీ మాట్లాడడం లేదు. పార్టీ కార్యకలాపాలకు కూడా చాలా వరకు దూరంగా ఉంటున్నారు. 

ఇటీవలే కొన్ని పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాలు పంచుకున్నారు. దాంతో ఆమెను రాజ్యసభకు పంపించవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. అయితే కొద్ది రోజులుగా ఆమె మౌనంగా ఉంటున్నారు. కేసీఆర్ నిర్ణయం వల్లనే ఆమె మౌనం దాల్చినట్లు భావిస్తున్నారు.

ఒక రాజ్యసభ సీటును ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అయితే, 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు సీటు ఇవ్వలేదు. 

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నామా నాగేశ్వర రావుకు కేసీఆర్ ఖమ్మం లోకసభ సీటు ఇచ్చారు. సీటును త్యాగం చేసినందుకు తగిన స్థానం కల్పిస్తామని శ్రీనివాస రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీ మేరకు ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశాలున్నాయి. మరో సీటును ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.