న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ మీద న్యాయవాదులు కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల ఎన్ కౌంటర్ లో తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపిస్తూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. 

జీఎస్ గనీ, ప్రదీప్ కుమార్ అనే న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా వారు కోరారు. సుప్రీంకోర్టు 2014లో రూపొందించిన మార్గదర్శకాలను ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులు పాటించలేదని వారు ఆరోపించారు. 

దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్ నగర్ ఏసీపీ వి. సురేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్ కౌంటర్ పై ఇదివరకే కేసు నమోదు చేశారు. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) సభ్యులు విచారణ ప్రారంభించారు.

ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు శనివారం హైదరాబాదుకు చేరుకుని చటాన్ పల్లిలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ పై వారు విచారణ సాగిస్తున్నారు. చటాన్ పల్లి నుంచి వారు మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో నిందితుల శవాలను భద్రపరిచారు. ఈ నెల 9వ తేదీ వరకు శవాలను భద్రపరచాలని, అంత్యక్రియలు చేయకూడదని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.