హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసులో మరో నిందితుడు(మైనర్)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను (ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు) గుర్తించిన పోలీసులు.. వారిలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఒక మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు నేడు వెల్లడించారు. అయితే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిపారు.
‘‘మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశాం. ఐదో నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు’’అని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మేజర్లలో ఇప్పటికే పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.. మరో నిందితుడు ఒక ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్ ఖాన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మైనర్ల విషయానికి వస్తే.. ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్ కొడుకు, బల్దియా కార్పొరేటర్ కొడుకు, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకుడి కొడుకు ఉన్నారు. వీరి ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సాదుద్దీన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
ఇక, బాలిపై అత్యాచారం చోటుచేసుకున్నట్టుగా భావిస్తున్న ఇన్నోవా కారును పోలీసులు శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఈ కారును పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అత్యాచారం ఇందులోనే జరగడంతో కేసు దర్యాప్తులో ఇన్నోవా కీలకంగా మారింది. అయితే ఈ కారు ఎవరదనే విషయంపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు
ఇక, ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కొందరిని తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
అసలేం జరిగింది..
మే 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని అమ్నీషియా పబ్‌లో పార్టీ చేసుకున్న తర్వాత తన కుమార్తెను (మైనర్) గుర్తుతెలియని యువకులు వేధించారని బాధితురాలి తండ్రి మే 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు విచారణ చేపట్టి.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (D), POCSO చట్టంలోని 5,6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించారు.
అదే సమయంలో బాధితురాలు, నిందితులు మద్యం సేవించినట్లు కూడా పోలీసులు తోసిపుచ్చారు. ‘‘17 ఏళ్ల అమ్మాయిని ఐదుగురు యువకులు పబ్ నుంచి మొదటగా ఎరుపు రంగు మెర్సిడెస్ కారులో పేస్ట్రీ షాప్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత బృందం ఇన్నోవా కారులోకి మారిందని.. అందులోనే బాలికపై దాడి జరిగింది’’ అని పోలీసులు తెలిపారు.
