సిద్ధిపేట లోని రాయవరం గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. కాగా... బాలికపై ఈ ఘాతుకానికి ఆరుగురు యువకులు పాల్పడగా... వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన తనకు పరిచయమున్న ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. రాయవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్ సమీపంలోని రాజీవ్ రహదారి పరిసర ప్రాంతానికి వెళ్లగానే ఆ యువకుడు తన మిత్రులకు ఫోన్ చేసి పిలిచాడు. 

అక్కడే వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా యువకులు రాత్రంతా 12 గంటల పాటు బాలికపై ఆత్యాచారం చేశారు. బాధను తట్టుకోలేక ఆమె కేకలు వేస్తుంటే నోటిలో గుడ్డలు కుక్కి తీవ్రంగా కొట్టారు. తరువాత నడిరోడ్డుపై బాలికను పడేసి వెళ్లిపోయారు. కూతురు కనిపించట్లేదని వెతుకుతున్న తల్లిదండ్రులకు బాలిక అచేతన స్థితిలో కనిపించింది. 

దీంతో తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లి అడగగా తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ ఘటన రాజకీయంగా కూడా కలకలం రేపింది. దీంతో... పోలీసులు వెంటనే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

నిందితులు శివరాత్రి వెంకట్, శివరాత్రి ఆంజనేయులు, పరశురాములు, రజనీకాత్, మహ్మద్ రహీమ్ పాషా, శ్రీరాములు గా పోలీసులు తెలిపారు.