హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. గత 9 ఏళ్ల పాటు తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ఈ కేసులను పంజగుట్ట పోలీసులు సీసిఎస్ పోలీసులకు బదిలీ చేశారు. 

కేసు దర్యాప్తును సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈలోగా, ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ కొత్త విషయం ప్రసారమైంది. పంజగుట్టలో యువతి ఫిర్యాదు చేయడానికి మూడు రోజుల ముందు డాలర్ బాబు అనే వ్యక్తి నిందితులకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఏబీఎన్ టీవీ చానెల్ లో ఆ వార్తాకథనం ప్రసారమైంది. ఈ ఫోన్ సంభాషణల రికార్డును కూడా చానెల్ ప్రసారం చేసింది. 

అది అలా ఉంటే, ఎఫ్ఐఆర్, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితులను విచారించడానికి సిసీఎస్ పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసులు 42 పేజీలతో ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. 13 మందిలో రాజకీయ నాయకుల పిఎలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.

అత్యాచారం చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారంనాడు హైదరాబాదు పోలీసు కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు 27 మంది ఎబీవీపీ కార్యకర్తలు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.