హైదరాబాద్‌: యాదాద్రి సెక్స్ రాకెట్ వ్యవహారంపై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  బాయిలర్‌ కోళ్లకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లుగా చిన్నారుల శరీరాలు పెరిగేలా హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్నారనే విషయంపై స్పందిస్తూ దానిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని అడిగింది. 

ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇస్తున్న వారిపై ఐపీసీ సెక్షన్‌ 120(బీ) కింద కేసులు నమోదు చేశారా అని హైకోర్టు అడిగింది. ఇదంతా అధికారులకు తెలియకుండా జరిగి ఉంటుందని తాము భావించడం లేదని, నిర్వాహకులతో సంబంధిత అధికారులు లాలూచీపడినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
 
ఈ కేసులో నిందితుల బెయిలు వ్యాజ్యాలను సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వ్యతిరేకించారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుల విచారణకు సిట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని అడిగింది ఇటువంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశాలిచ్చేందుకు కూడా తాము సిద్ధమని తెలియజేసింది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది. 

యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారంటూ ఇటీవల వచ్చిన కథనాన్ని సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.  ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చామని అదనపు ఏజీ జె.రామచందర్‌రావు కోర్టుకు వివరణ ఇచ్చారు.
 
ఆ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత తీవ్రమైన కేసుల్లో బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చి చేతులు కడిగేసుకుంటే సరిపోదని, చిన్నారుల రక్షణ కోసం చర్యలు చేపట్టడంతోపాటు బాధ్యులపైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. సిట్‌ను ఏర్పాటు చేసి అందులో మహిళా అధికారులను కూడా నియమించాలని సూచించింది. కేసు పురోగతిపై వివరణ ఇచ్చేందుకు మంగళవారం స్వయంగా డిసిపి హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

యాదాద్రి సెక్స్ రాకెట్: కొత్త కోణాన్ని బయటపెట్టిన కమిటీ

యాదాద్రి సెక్స్ రాకెట్: మరో ఏడుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచారం మానేశాం, విటులు రావద్దంటూ పోస్టర్లు

యాదాద్రి సెక్స్ రాకెట్... వ్యభిచారుణులనే తల్లులుగా భావిస్తూ రోదిస్తున్న చిన్నారులు

యాదాద్రి సెక్స్ రాకెట్: తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు

ఎవరీ కల్యాణి: యాదాద్రి సెక్స్ రాకెట్ ఎలా వెలుగు చూసింది?

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

యాదగిరి గుట్ట సెక్స్ రాకెట్: మహానది సినిమా చూశారా?