హైదరాబాద్: ఏకంగా రాష్ట్ర మంత్రినే బూతులు తిడుతూ అడ్డంగా బుక్కయిన జిహెచ్ఎంసీ ఉన్నతాధికారిపై వేటు పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుదుర్భాషలాడుతున్న గోషామహల్ సర్కిల్-14 ఇంచార్జి డిప్యూటీ కమీషనర్ వినయ్ కుమార్ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపడిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో బాగా ప్రచారమవడమే కాకుండా మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అతడిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

డబుల్ బెడ్రూం ఇళ్ల విషయమై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, డిసి వినయ్ కుమార్ మధ్య ఫోన్ సంబాషణ సాగింది. ఈ క్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పోరేటర్ ను బూతులు తిడుతూ వినయ్ కుమార్ మాట్లాడినట్లుగా ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. దీంతో ఉన్న తాధికారులు వినయ్‌కుమార్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది. 

అయితే మంత్రిని తిడుతున్న ఆడియో బయటకు రానివ్వకుండా ఉన్నతాధికారులతో పాటు, స్వయంగా మంత్రి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు       ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కాగా మరీ తీవ్ర స్థాయిలో ఉన్న మాటలను కట్‌ చేస్తూ ఓ ఆడియో మాత్రం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా మాద్యమాల్లో వైరల్ గా మారింది.