ఉచితంగా సరకు ఇస్తామంటారు... రూ.15 వేలు కట్టమంటారు..

gang arrested by tirumalagiri police
Highlights

ఉచితంగా.. అతి తక్కువ ధరకే సరకు ఇస్తామని చెప్పి దుకాణదారులను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ సుమతి మీడియాకు వివరించారు

ఉచితంగా.. అతి తక్కువ ధరకే సరకు ఇస్తామని చెప్పి దుకాణదారులను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. రాజేంద్రనగర్ కయాంనగర్ పహాడి ప్రాంతానికి చెందిన సయ్యద్ షబ్బీర్ అలీ, మిర్ మోహిది అలీ రజ్వీ, జియా అబ్బాస్, మొహమ్మద్ షాహిద్ అలీఖాన్‌లు ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటారు.

ఆ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల నిర్వాహాకులతో తాము కోకో కోలా కంపెనీ నుంచి వస్తున్నామని... మంచి మంచి ఆఫర్లు ఉన్నాయని చెబుతారు. నమ్మకం కుదిరాకా శాంపిల్‌గా కోకో కోలా కూల్‌డ్రింక్స్‌ను అందజేసి.. అనంతరం మీరు కొత్తగా కోకో కోలా నుంచి సరకును  కొనుగోలు చేస్తే ఆఫర్లు ఉన్నాయని.. రిఫ్రిజిరేటర్లు, 24 డబ్బాల కోక్ బాటిల్స్ ఉచితంగానే అందిస్తామని చెబుతారు. వీళ్ల బుట్టలో పడ్డారని నమ్మకం కుదరగానే ఇందుకు అడ్వాన్స్‌గా రూ.15 వేలు చెల్లించాలని చెప్పి నగదు వసూలు చేసి వెళ్లిపోతారు.

వారు ఎన్ని రోజులైనా పత్తా  లేకుండా పోవడంతో దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.. ఇప్పటి వరకు వీరిపై హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇలాగే పలువురిని మోసం చేసేందుకు వెళ్తుండగా బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు ఈ ముఠాని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.125 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

loader