హైదరాబాద్: స్టార్ హోటల్ లో ఉద్యోగాలంటూ ఓ నకిలీ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశాడు. అది కూడా అమ్మాయి పేరుతోనే. స్టార్ హోటల్స్ లో ఫ్రంట్ ఆఫీస్ లో ఉద్యోగాలంటూ వల విసిరాడు. మహిళ పేరుతో ఉండటంతో నమ్మేసిన కొందరు తమ రెజ్యూమ్స్ ను పంపించారు. 

రెజ్యూమ్స్ లో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాటలు కలిపేవాడు. ఎంతో చాకచక్యంగా తనవైపునకు తిప్పుకునేవాడు. మంచి ఉద్యోగం కావాలంటే న్యూడ్ ఫోటోలు పంపాలంటూ ఒత్తిడి పెంచేవాడు. నిజమని నమ్మిన కొందరు వివాహితలు, అవివాహితలు న్యూడ్ ఫోటోలు పంపిచేశారు. 

న్యూడ్ ఫోటోలను ఆసరాగా పెట్టుకుని వాడిలోని మృగాన్ని నిద్రలేపాడు. న్యూడ్ ఫోటోలను నెట్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. పరువుపోతుందన్న భయంతో కొందరు  ఆ కేటుగాడు చెప్పిన పనులకు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. 

అయినా వాడి తీరు మారకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. స్టార్ హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపాడు ఓ ప్రబుద్ధుడు. 

మంచి జీతం కావాలంటే న్యూడ్ ఫోటోలు పెట్టాలంటూ ఒత్తిడులు పెంచడం ఆ తర్వాత వాటిని ఆసరాగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో ఆ  కేటుగాడిపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు. 

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మోసగాడి ట్రాప్ వేలాది మంది పడినట్లు పోలీసులు గుర్తించారు. కేటుగాడి ఫేస్ బుక్ లో మెుత్తం 2వేల మంది మహిళల న్యూడ్ ఫోటోలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.