Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్ (వీడియో)

జనవరి నెల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్.. అదే నుమాయిష్, ప్రతీ యేటా లాగానే ఈయేడు కూడా ఎగ్జిబిషన్ మొదలై పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ నుమాయిష్ లో స్టాల్ ను ప్రారంభించింది. ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా ఇతర అధికారులతో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. 

జనవరి నెల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్.. అదే నుమాయిష్, ప్రతీ యేటా లాగానే ఈయేడు కూడా ఎగ్జిబిషన్ మొదలై పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ నుమాయిష్ లో స్టాల్ ను ప్రారంభించింది.  ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె.ఝా ఇతర అధికారులతో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. పెద్దలకు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రాధాన్యతను గుర్తుచేయటం, పిల్లలకు అటవీ జంతువులపై అవగాహన కలిగించేలా హరితం, శివం, సుందరం- నినాదంతో 
ఈ సారి అటవీ శాఖ స్టాల్ ను తీర్చిదిద్దారు. గత కొన్నేళ్లుగా ఆటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల సమస్త సమాచారాన్ని ఈ ప్రదర్శనలో పొందుపర్చారు.  తెలంగాణ నయగారా అని పేరొందిన బొగత జలపాతంతో పాటు, మల్లెల తీర్ధం జలపాతాలను ప్రవేశ ద్వారంపై అంత్యంత ఆకర్షణీయంగా అటవీ శాఖ తీర్చిదిద్దింది.

 తెలంగాణకు హరితహారం- స్కూల్ పిల్లల ప్రాధాన్యత, వన దర్శిని కార్యక్రమం, తెలంగాణలో ఎకో టూరిజం స్పాట్లు వాటి వివరాలు, పట్టణ ప్రాంతాల కోసం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అడవులు, జంతుజాలం రక్షణకు తీసుకుంటున్న చర్యలు- గడ్డి క్షేత్రాల పెంపకం, ఈ యేడాదిని కూడా అగ్ని ప్రమాదాలు లేని అడవుల సంవత్సరంగా పాటించడం.. ఇలా అటవీ శాఖ తరుపున అమలు చేస్తున్న కార్యక్రమాల సమాహారాన్ని ఎగ్జిబిషన్ వేదికగా ప్రదర్శిస్తోంది.

పెద్దల కోసం ఔషధ మొక్కల స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం బర్డ్స్ కాల్, మినీ జూను కూడా ఎగ్జిబిషన్ లోనే ఏర్పాటు చేశారు.  అటవీ శాఖ ద్వారా చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ఆరోగ్య , అభివృద్ది తెలంగాణలో భాగస్వామ్యం అవుతున్నాయని, ఇందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది గర్వపడుతున్నారని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కే.ఝా ఈ సందర్భంగా వెల్లడించారు. అటవీ శాఖ స్టాల్ కూడా వీటన్నింటిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దామన్నారు. సంక్రాంతి సెలవులతో పాటు, మరో నెల రోజుల పాటు ఎగ్జిబిషన్ లో ఉండే అటవీ శాఖ ప్రదర్శనను సందర్శించేలా ప్రతీ ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు కోరారు. 

ఈ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో పిసీపీఎఫ్ పీ.కె.ఝా తో పాటు, పీసీసీఎఫ్ ( ఐ.టీ, విజిలెన్స్) పి.రఘువీర్, పృధ్వీ రాజ్,  సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,  అదనపు అటవీ సంరక్షణ అధికారులు  మునీంద్ర, చంద్ర శేఖర్ రెడ్డి , ఆర్.ఎం. డోబ్రియాల్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.