రక్తసిక్తమైన తెలంగాణ రోడ్లు... రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాాదాల బారినపడి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులో ముగ్గురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. 

Five killed in road accident at telangana

హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాలతో తెలంగాణలో ఐదుగురు మృతిచెందారు. హైదరాబాద్ శివారులో, వరంగల్ జిల్లాలో జరిగిన బైక్ యాక్సిడెంట్స్ లో నలుగురు యువకులు, ఓ యువతి దుర్మరణం చెందారు. ఇక హైదరాబాద్ లో ఓ మైనర్ బాలుడు కారుతో రోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించాడు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై బైక్ పై ఇద్దరు యువకులు, ఓ యువతి వెళుతుండగా ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వున్న ముగ్గురు దుర్మరణం చెందారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో బైక్ ను ఢీకొట్టిన వాహనమేదో ఎవరూ గమనించలేదు. బైక్ ను ఢీకొన్న తర్వాత వాహనాన్ని ఆపకుండా పరారయ్యారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. 

ఇదిలావుంటే వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలితీసుకుంది. ఖిలా వరంగల్ మండలంలోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డుపక్కన ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. బైక్ పై అతివేగంతో వచ్చిన యువకులు లారీని గమనించలేకపోయారు. దీంతో బైక్ లారీ వెనకవైపు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్ గా గుర్తించారు. యువకుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారమివ్వగా హాస్పిటల్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇక ఇలాంటి ఘోర ప్రమాదమే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైదాబాద్ లో ఓ బాలుడు కారుతో రోడ్డుపైకి వచ్చి బీభత్సం సృష్టించాడు. అతివేగంతో వెళుతూ కారు అదుపుతప్పి ఇతరు వాహనాలపైకి దూసుకెళ్లింది.  సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుటగల పార్క్ వద్ద నిలిపిన వాహనాలను కార్లు ఢీకొట్టాయి. దీంతో మూడుకార్లు ధ్వంసమయ్యాయి.  

ప్రమాద సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ధ్వంసమైన కార్ల యజమానులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ఇలా ప్రమాదాలకు కారణమై కేసుల్లో చిక్కుకోవద్దని తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios