డ్రగ్స్ కేసు: తెలంగాణ హైకోర్టులో ఎడ్విన్ ముందస్తు బెయిల్ పిటిషన్
డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎడ్విన్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఎడ్విన్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గోవాలో ఎడ్విన్ కోసం హైద్రాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో ఎడ్విన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాంపల్లి క్రిమినల్ కోర్టు రెండు రోజుల క్రితం ఎడ్విన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఎడ్విన్ కోసం హైద్రాబాద్ పోలీసులు గోవాలో గాలింపు చర్యలు చేపట్టారు . దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఎడ్విన్ సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఏడాది ఆగస్టు లో ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎడ్విన్ కీలక నిందితుడు. గోవాకు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ నూన్స్ ను హైద్రాబాద్ పోలీసులు గోవా నుండి అతడిని తీసుకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎడ్విన్ అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ ను సృష్టించాడని కూడా హైద్రాబాద్ పోలీసులు గుర్తించారు.
ఎడ్విన్ ను పట్టుకొనేందుకు గోవా పోలీసుల సహయం తీసుకుంటున్నారు. హైద్రాబాద్ పోలీసులు. ఎడ్విన్ సమర్పించిన కరోనా సర్టిఫికెట్ కు సంబంధించిన ల్యాబ్ రికార్డులను కూడా హైద్రాబాద్ పోలీసులు పరిశీలించారు. అయితే ఈ రిపోర్ట్ నకిలీదని గుర్తించారు. నకిలీ కరోనా సర్టిపికెట్ సమర్పించిన విషయమై ఎడ్విన్ పై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.
also read:హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా: గోవాలో స్టీఫెన్ డిసౌజాను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు
ఈ నెల 22వ తేదీన గోవాకు చెందిన స్టీఫెన్ డిసౌజా ను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను గోవా నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. గోవాలో ఓ పబ్ ను డిసౌజా నడుపుతున్నారు. డీసౌజాతో పాటు ఎడ్విన్ కూడా హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఆగస్టులో నమోదు చేసిన కేసులో ఎడ్విన్, డిసౌజాల పేర్లున్నాయి. హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకు కూడా డిసౌజా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డిసౌజాను కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ను ఇవాళ దాఖలు చేశారు.