డ్రగ్స్ వివాదం: హైకోర్టుకెక్కనున్న కేటీఆర్, లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి సై
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివాదం ముదురుతోంది. తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్: డ్రగ్స్ విషయంలో తనపై చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైకోర్టుకెక్కనున్నారు. హైకోర్టులో ఆయన పరువు నష్టం దావా వేయనున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దోషులకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. కోర్టు ద్వారా తనపై వస్తున్న తప్పుడు ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విసిరిన సవాల్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ సవాల్ ను స్వీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ చేశారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, తమతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధపడాలని ఆయన షరతు పెట్టారు.
గత కొద్ది రోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సినీ ప్రముఖులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
కేటీఆర్ ను డ్రగ్స్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ వస్తున్నారు. తనకూ డ్రగ్స్ కు సంబంధం ఏమిటని ఆయన అడిగారు.