హైదరాబాద్: చైన్‌లింక్ స్కీమ్‌లతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్  పోలీసులు అరెస్ట్ చేశారు.  
శనివారం నాడు తన కార్యాలయంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను  సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు.

బెంగుళూరుకు చెందిన అభిలాష్ థామస్,ప్రేమ్ కుమార్ తో పాటు కొందరు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడినట్టుగా ఆయన చెప్పారు. 
ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో చైన్ లింక్ వ్యాపారాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు.తమ సంస్థలో రూ. 12,500తో మెంబర్‌షిప్‌ తీసుకొని ఇతరును చేర్చితే లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారని ఆయన చెప్పారు.

సుమారు 10 లక్షల మందిని మోసగించి రూ. 1500 కోట్లు వసూలు చేశారని సజ్జనార్ తెలిపారు. 10 రోజుల క్రితమే ఈ సంస్థపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు వారి భార్యలు కూడా ఉన్నారని తెలిపారు.సెలవులు పెట్టి వీరు ఈ స్కీమ్ లో పాల్గొంటున్నారన్నారు. ఈ సంస్థ సీఈఓ సహా మొత్తం 24 మందిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఛైర్మెన్ పరారీలో ఉన్నట్టుగా సీపీ వెల్లడించారు.