ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో వలవేసి.. వాట్సాప్ లో వీడియో కాల్స్, న్యూడ్ వీడియోలు చూపించి, స్క్రీన్ రికార్డింగ్ తో న్యూడ్ గా వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ముఠాలు పెరిగిపోతున్నాయి. సెక్స్ టార్షన్ గా పిలిచే ఈ నేరాలకు సంబంధించి నగర సైబర్ క్రైమ్ ఠాణాకు రెండురోజులకో ఫిర్యాదు వస్తోందంటేనే వీరెంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా ఇలాంటి గ్యాంగ్ వలలో పడ్డాడు తార్నాకకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్. దీంతో దాదాపు రూ.10 లక్షల వరకు నష్టపోయాడు. అయినా వాళ్ల బెదిరింపులు ఆగకపోవడంతో శుక్ర వారం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

వివరాల్లోకి వెడితే.. తార్నాకకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ కు కొన్నాళ్ల క్రితం ఓ యువతి పేరుతో ఎఫ్ బిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని అతను యాక్సెప్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా మారిపోయారు. వీరిద్దరూ తరచుగా మెసెంజర్లో ఛాటింగ్ చేసేవారు.

కొద్ది కాలానికి సదరు యువతి ఈవెంట్ మేనేజర్ తో సెక్స్‌ చాటింగ్‌ మొదలు పెట్టింది. ఆ తరువాత మెల్లగా వాట్సప్ నెంబర్ అడిగి తీసుకుంది. ఆ తరువాత ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న అర్ధనగ్న, నగ్న వీడియోలు ఏవో స్పెషల్ యాప్స్ తో తమ ఫోన్ లో అతనికి ప్లే చేసి లైవ్ లా చూపించారు. 

దీంతో సదరు వ్యక్తి ఆ యువతే తనతో మాట్లాడుతూ నగ్నంగా మారిందని భావించాడు. అలా పూర్తిగా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. ఒకటి రెండు సార్లు అలా వీడియోలు చూపించి.. ఆ తరువాత ఈవెంట్ మేనేజర్ ను కూడా అలాగే చేయాలని అడిగారు. మాయలో పడ్డ సదరు మేనేజర్ అలాగే చేశాడు. ఈ దృశ్యాలను సైబర్ నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ తో రికార్డ్ చేశారు. 

ఆ తరువాత ఈ రికార్డింగ్ వీడియోల్ని, వీటిని యూట్యూబ్‌ చానల్‌లో ఉంచిన లింకుల్ని బాధితుడికి పంపారు. దీంతో కంగుతిన్న అతను వెంటనే వాటిని తొలగించాలని అడిగాడు. 

అయితే అలా చేయాలంటే పది లక్షలు ఇవ్వాలని బేరం పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేరగాళ్ల చెప్పిన ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ చేశాడు. ఆ తరువాత కొన్నిరోజులకు మరికొంత డబ్బు ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.