లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో మద్యం అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ మద్యం అమ్మకాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ‘‘సారాయి (మద్యం) అమ్ముకునే బదులు వ్యభిచారం చేసుకుని బతకండి. సారాయి మీద వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వనరుగా చూడకూడదు.’’అని ప్రభుత్వాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మఖ్ధూం భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ ఉన్నంత వరకూ మద్యం షాపులను మూసేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాల సలహాలను స్వీకరించే స్థితి లో సీఎం కేసీఆర్‌ లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. 

నిరుపేద జర్నలిస్టుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా. విశాఖపట్నంలో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఫ్యాక్టరీని తక్షణం మూసేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద క్రిమినల్‌ కేసులు పెట్టాలని, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఇదిలా ఉండగా...లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలు, వలస కార్మికులు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని సీపీఐ పార్టీ అధ్యక్షతన దీక్ష చేపట్టారు.

మక్దూం భవన్‌లో సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, బాలమల్లేష్‌, పశ్యపద్మ, డాక్టర్‌ సుధాకర్‌ దీక్ష లో పాల్గొన్నారు. సీపీఐ నేతల దీక్షలను టీజేఎ్‌సఅధ్యక్షుడు కోదండరాం, టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ నిమ్మరసం అందించి విరమింపజేశారు. 

కేంద్రం 10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రాలకు విడుదల చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. మద్యం దుకాణాలను తెరవడం వల్ల కరోనా విజృంభిస్తుందన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే వైరస్‌ విజృంభిస్తుందని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. వలస కార్మికులను ఆదుకుంటేనే రేపు ఆర్థిక పరిస్థితి మళ్లీ నిలబడుతుందని కోదండరాం అన్నారు. కరోనాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రమణ డిమాండ్‌ చేశారు.