టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవ్ పార్టీలో మునిగి తేలుతూ, డ్రగ్స్ మత్తులో జోగుతున్నారని ఎద్దేవా చేశారు టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యేలను సాగర్‌లో ఎన్నికల ప్రచారానికి పంపించారంటూ ఆయన దుయ్యబట్టారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ అక్రమణలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వున్నారని.. చివరికి కల్లు కాంపౌండ్‌లను కూడా వదలట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

విలువలు, ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం జానారెడ్డి అని ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని.. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను అటకెక్కించారని ఆయన ఆరోపించారు. సాగర్ ప్రజలు జానారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

సాగర్‌లో బీజేపీకి డిపాజిట్ దక్కదని... జానారెడ్డి ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడని ఆయన కొనియాడారు. మండల వ్యవస్థను తీసుకొచ్చింది జానారెడ్డేనని... ఆయన గెలిస్తే శాసనసభలో కేసీఆర్ ఆటలు సాగవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read:జానాని ఓడించాలని రేవంత్, కోమటిరెడ్డి కుట్రలు...: గుత్తా సుఖేందర్ సంచలనం

ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు యువరాజు సన్నిహిత ఎమ్మెల్యేలంటూ ఆయన ఆరోపించారు. నెళ్లికల్లు కోసం కేసీఆర్ బిచ్చం ఎత్తుతా అంటున్నారని.. రూ.150 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ధనిక రాష్ట్రం తెలంగాణ బిచ్చం ఎత్తాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులు బిచ్చగాళ్లు కాదన్నారు. డ్రగ్స్ మూలాలు ఆ యువ రాజు  మిత్ర బృందం వద్దకు చేరాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.