బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్  రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు వెళ్లారు. మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ దక్కని జితేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 

Jithender Reddy: బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి ఈ లోక్ సభ ఎన్నికలకు ముందే పార్టీకి షాక్ ఇస్తారా? మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఏకంగా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన హస్తం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. నిర్ణయం జితేందర్ రెడ్డి వద్ద ఉన్నది. ఇక మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వంశీచంద్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

బీజేపీ ఇటీవలే అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఖంగుతిన్నారు.

Scroll to load tweet…

2014లో మహబూబ్ నగర్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జితేందర్ రెడ్డి గెలిచారు. ఈ సారి తనకే టికెట్ వస్తుందని జితేందర్ రెడ్డి ఆశించారు. కానీ, బీజేపీ హైకమాండ్ ఆయనకు మొండిచేయి చూపించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశల కూరుకుపోయారు. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు కలిశారు. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

తనకు టికెట్ రాకపోవడంతో బాధపడ్డానని, అందుకు తనను ఓదార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారని జితేందర్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.