కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్‌లో కలకలం.. ఆ నేతల్లో అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళన..!

వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ ఇస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

CM KCR Assures TRS Tickets to Sitting MLAs creates disappointment in several leaders

వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ ఇస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన ప్రస్తుతం సిట్టింగ్‌లుగా ఉన్నవారిలో సంతోషం నింపగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన పలువురు సీనియర్లు మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది. తమ భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం. మరోవైపు మునుగోడులో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ అక్కడ విజయం సాధించింది. దీంతో  అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కూటమిగానే ముందుకు సాగాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారని.. ఈ క్రమంలోనే వారికి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ఆశించి నిరాశకు లోనయ్యే కొందరు సీనియర్ నేతలు పార్టీ మారిన ఆశ్చర్యపోనవసరం లేదనే మాట కూడా వినిపిస్తుంది. 

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో కలిసి ముందుకు సాగాలంటే.. వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, దేవరకొండ,  కొల్లాపూర్‌, బెల్లంపల్లి, నాంపల్లి, నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానాలను సీపీఐ కోరుతున్నట్టుగా సమాచారాం. మరోవైపు సీపీఎం తమకు బలమైన ప్రాబల్యం ఉన్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏడెనిమిది స్థానాలను కోరుతున్నట్లు సమాచారం.

అయితే వామపక్ష పార్టీలు కోరుతున్న స్థానాల్లో మెజారిటీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్ వద్దే ఉన్నాయి. ఒకవేళ సీఎం కేసీఆర్ రెండు పార్టీలకు కలిపి 7 నుంచి 10 వరకు స్థానాలను కేటాయించినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ల్లో కొందరికి అవకాశాలు లేకుండా పోతాయి. ఈ లెక్కలు వేసుకుంటున్న కొందరు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు(వామపక్ష పార్టీలు కోరుతున్నట్టుగా చెబుతున్న స్థానాల్లోని వారు).. అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆ నేతలపై నీళ్లు చల్లిన కేసీఆర్ ప్రకటన.. 
ఎమ్మెల్యేల పనితీరుపై గతంలో కేసీఆర్ పలు అంతర్గత సర్వేలు  చేయించారు. ఇందులో 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టుగా తేలినట్టుగా ప్రచారం జరిగింది. దీంతో పలు స్థానాల్లో టిక్కెట్ ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. కొందరైతే టికెట్‌పై ఆశతో ఇప్పటికే నియోజకవర్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా గ్రౌండ్ వర్క్, నిధుల సమీకరణ కూడా చేసుకుంటున్నారు. అయితే కేసీఆర్ తాజా ప్రకటనతో అటువంటి వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.  దీంతో వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. 

తెలంగాణ శాసనసభ గణంకాలను పరిశీలిస్తే.. మొత్తం 119 మంది సభ్యుల ఉన్న శాసనసభలో టీఆర్ఎస్‌కు ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే వీరిలో కొందరు కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్‌లోకి చేరినవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించినవారే. దీంతో ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయినవారు కూడా టికెట్లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. దీంతో ఆ స్థానాల్లో పార్టీ టికెట్ కోసం పోటీ భారీగానే ఉంది. అలాంటి నియోజవర్గాల్లో పలు సందర్భాల్లో కొత్త నేతలు, పాత నేతల మధ్య వర్గ విబేధాలు భగ్గుమంటూనే ఉన్నాయి. 

వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారికి మళ్లీ అవకాశం ఇస్తే.. చాలా కాలంగా వారికి వ్యతిరేకంగా పోరాడిన తామేం కావాలని కొందరు సీనియర్ నేతలు వారి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేతలకు టిక్కెట్లు రాని పక్షంలో వారిని పార్టీలోనే ఉండేలా ఒప్పించడం టీఆర్ఎస్ అధిష్టానానికి చాలా కష్టమైన పని అని టీఆర్‌ఎస్ వర్గాల్లోనే చర్చ సాగుతుంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే నియోజవర్గంలో రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయని పలుమార్లు బహిర్గతం అయింది. టీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకున్న అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదనేది బహిరంగ రహస్యమే. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ తీగల కృష్ణారెడ్డి, ఎల్‌బీ నగర్‌‌లో సుధీర్ రెడ్డి వర్సెస్ రామ్మోహన్ గౌడ్‌గా పరిస్థితులు ఉన్నాయి. 

కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్సెస్ కోవా లక్ష్మి, పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ మధుసూధనా చారి, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  వర్సెస్ జలగం వెంకట్ రావు, పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  వర్సెస్ వేముల వీరేశం, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వర్సెస్ కె. కనకయ్య, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వర్సెస్ పిడమర్తి  రవి, అశ్వారావుపేటలో ఎమ్మెల్యేమెచ్చా నాగేశ్వరరావు వర్సెస్ తాటి వెంకటేశ్వర్లు పరిస్థితులు ఉన్నాయి. 

వీరిలో మాజీ మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్‌లకే కేసీఆర్‌ టికెట్లు కేటాయించిన పక్షంలో వీరిలో.. గతంలో ఈ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ నేతల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులకు కేసీఆర్ ఎలా చెక్‌ పెడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios