పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ లో రచ్చ జరిగింది. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రతిపక్షంతో గొంతు కలిపారు. దీంతో బడ్జెట్ సమావేశాన్ని మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. ఒక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ నాయకుడు కాగా.. మరో వర్గానికి నగర మేయర్ లక్ష్మినారాయణ నాయకత్వం వహిస్తున్నారు.

దీంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు మేయర్ మీద తిరుగుబాటు చేశారు. రామగుండం నగర పాలక సంస్థ సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతిపక్ష కార్పొరేటర్లతో కలిసి మేయర మీద ఆందోళన చేశారు. సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. 14 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు.

సమావేశం వాయిదా వేసిన తర్వాత కూడా సమావేశమందిరంలో ఆందోళన కొనసాగింది. కొందరు సభ్యులు ఎజెండా కాపీలను చింపి మేయర్ ముందు విసిరేశారు. ఈ పాలక వర్గాన్ని రద్దు చేయాలని, మేయర్ పదవి నుంచి దిగిపోవాలని కార్పొరేటర్లంతా డిమాండ్ చేశారు. పైన ఉన్న వీడియోలో కార్పొరేటర్లు ఎలా ఆందోళన చేస్తున్నారో చూడొచ్చు.