బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో సాముహిక అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో సాముహిక అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(ఏ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులుకు ఫిర్యాదు చేసిందేవరనే విషయం తెలియాల్సి ఉంది.
అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఇటీవల ప్రెస్ మీట్‌లో రఘునందన్ రావు మాట్లాడుతూ.. అమ్నేషియా పబ్ నుంచి బాలికను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటనకు సంబంధించినవిగా చెబుతూ రఘునందన్ రావు ఇటీవల కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కొడుకు అని రఘునందన్ రావు ఆరోపించారు. అయితే ఫొటోలు, వీడియోలు విడుదల చేసినందుకు రఘునందన్ రావుపై సుమోటోగా కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ భావించారు.
ఈ క్రమంలోనే పోలీసులు న్యాయ సలహా తీసుకన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేసే విషయంలో తొందరపడి చర్యలు తీసుకొవద్దని లాయర్లు వారిని చెప్పినట్టుగా సమాచారం. ‘‘ఈ విషయంలో రఘునందన్ రావుపై చర్యలు తీసుకుంటే.. బాలిక కొంతమంది నిందితులతో కలిసి పబ్ వెలుపల నడుస్తున్నట్లు చూపించే వీడియో ఫుటేజీని ప్రసారం చేసిన మీడియా సంస్థలతో సహా అందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని లాయర్లు విచారణ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రఘునందన్ రావుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ కార్యాలయం.. అబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండటం.. అక్కడ రఘునందన్ రావుపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. మరోవైపు సామూహిక అత్యాచార బాధితురాలికి సంబంధించిన కంటెంట్‌ను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన జర్నలిస్టు సుభాన్‌కు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
కేసులు ఎదుర్కొవడం కొత్త కాదు.. రఘునందన్ రావు
మరోవైపు మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో హోంమంత్రి మనమడు ఉన్నాడని తాను చెప్పలేదన్నారు. ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని తాను చెప్పానని వివరణ ఇచ్చారు. గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మైనర్ బాలిక ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఎమ్మెల్యే వివరించారు. తాను ఈ ఫోటోలు విడుదల చేయకముందే అన్ని టీవీల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. బాధితురాలి పేరును కూడా తాను ప్రస్తావించలేదన్నారు.
గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తాను మాట్లాడానని రఘునందన్ రావు చెప్పారు. ఈ విషయమై తాను ఏం తప్పు చేశానని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతన్నారని ప్రశ్నించారు. కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తకాదన్నారు. ఈ విషయం వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కు కూడా తెలుసునని చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి తాను ఫోటోలు విడుదల చేసని విషయంలో తన తప్పుంటే తనపై కేసు పెట్టుకోవాలని రఘునందన్ రావు పోలీసులను కోరారు.
