ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కే అత్యధిక నిధులు..
రాజకీయ పార్టీలకు సంబంధించిన 2022-23 వార్షిక ఆడిట్ నివేదికను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే అత్యధిక నిధులు పొందుతున్నాయని పేర్కొంది. ఇందులో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ 64 స్థానాలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 39 స్థానాలు మాత్రమే కైవసం చేసుకొని బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక లబ్ది పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో మాత్రం బీఆర్ఎస్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ఆయా పార్టీల తాజా వార్షిక ఆడిట్ నివేదికలు వెల్లడించాయి.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనంప్రకారం.. ఐదు ప్రాంతీయ పార్టీలైన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు (వైసీపీ) కలిసి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,243 కోట్లు అందుకున్నాయి. అయితే ఇవే పార్టీలకు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొంత నిధులు తగ్గాయి. 2021-22లో బాండ్ల ద్వారా ఆ పార్టీలకు రూ.1,338 కోట్లు వచ్చాయి. అయితే ఈ సారి బీఆర్ఎస్ మాత్రం వ్యక్తిగతంగా బాండ్ల నుంచి 3.4 రెట్లు ఎక్కువ విరాళాలు సేకరించింది.
కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం రాబడుల్లో 97 శాతం, డీఎంకేకు 86 శాతం, బీజేడీకి 84, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 70 శాతం, బీఆర్ఎస్ కు 71 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయి. అయితే ప్రస్తుతం జాతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.36.4 కోట్లు వచ్చాయి. ఆ పార్టీకి 2021-22లో రూ.44.5 కోట్లు రాగా.. 2022-23లో రూ.85.2 కోట్లు వచ్చాయి. ఆ పార్టీ వార్షిక వ్యయం రూ.30.3 కోట్ల నుంచి రూ.102 కోట్లకు పెరిగింది. 2022-23లో ఆప్ సాధారణ ప్రచార ఖర్చులు రూ.13.7 కోట్ల నుంచి 330 శాతం పెరిగి రూ.58.8 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఈ పార్టీకి 2022-23లో రూ.23.6 కోట్లు ఖర్చయ్యాయి.
ఈ ఐదు ప్రాంతీయ పార్టీలు ఈసీకి సమర్పించిన 2022-23 వార్షిక ఆడిట్ నివేదికల ప్రకారం.. బీఆర్ఎస్ ప్రకటించిన మొత్తం ఆదాయం అత్యధికంగా రూ.737.7 కోట్లు (2021-22లో రూ.218 కోట్ల నుంచి పెరిగింది), తృణమూల్ రూ.333.4 కోట్లు (రూ.545.7 కోట్ల నుంచి తగ్గింది), డీఎంకే రూ.214.3 కోట్లు (రూ.214.3 కోట్లు తగ్గింది). బీజేడీ రూ.181 కోట్లు (రూ.307 కోట్ల నుంచి), వైఎస్సార్ కాంగ్రెస్ రూ.74.8 కోట్లు (రూ.93.7 కోట్ల నుంచి తగ్గాయి). 2022-23లో తృణమూల్ రూ.181 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రూ.79.3 కోట్లు, బీఆర్ఎస్ రూ.57.5 కోట్లు, డీఎంకే రూ.52.6 కోట్లు, బీజేడీ రూ.9.9 కోట్లు ఖర్చు చేశాయి.
ప్రతిపక్షాల విమర్శలతో పాటు పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టులో సవాలును ఎదుర్కొంటున్న ఈ బాండ్ల పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినది పార్టీలో ముందు వరసలో ఉన్నది బీఆర్ఎస్. ఆ పార్టీకి 2022-23లో బాండ్ల ద్వారా రూ.529 కోట్లు వచ్చాయి. 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తృణమూల్ రూ.325 కోట్లు, డీఎంకే రూ.185 కోట్లు, బీజేడీ రూ.152 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రూ.52 కోట్లు సేకరించాయి. 2021-22లో ఈ నాలుగు పార్టీలకు బాండ్ల ద్వారా అధిక మొత్తాలు రాగా, తృణమూల్ కాంగ్రెస్ కు రూ.528 కోట్లు, డీఎంకే కు రూ.306 కోట్లు, బీజేడీకు రూ.291 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ కు రూ.60 కోట్లు వచ్చాయి.
2022-23 వార్షిక ఆడిట్ నివేదికను గురువారం ఈసీ బహిర్గతం చేసింది. ఇందులో మరో జాతీయ పార్టీ సీపీఎం మొత్తం రాబడులు రూ .141.7 కోట్లుగా చూపించాయి. ఇది 2021-22 లో రూ .162.2 కోట్ల నుండి రూ .106 కోట్లకు తగ్గింది, ఇది 2021-22 లో చేసిన రూ .83.4 కోట్లతో పోలిస్తే ఎక్కువ గా ఉంది.