యాదాద్రి: సంచలనం సృష్టింంచిన తొమ్మిది తరగతి విద్యార్థిని శ్రావణి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీసు స్టేషన్ పరిధిలోని హజీపూర్ లో జరిగిన శ్రావణి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై గొంతు నులిమి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. 

చంపేసిన తర్వాత శ్రావణి మృతదేహాన్ని బావిలో పూడ్చిపెట్టేశారని పోస్టుమార్టం జరిపిన వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలిసిన వ్యక్తులే శ్రావణిని నమ్మించి ఆ దారిలో తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని బావిస్తున్నారు. 
 
సంఘటన జరిగిన రోజు ఉదయం 11 గంటలకు పాఠశాల నుంచి మండల కేంద్రానికి చెందిన మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి షేరింగ్‌ ఆటోలో బొమ్మలరామారం చేరుకుంది. అయితే ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం కీసర, బొమ్మలరామారం, రంగాపూర్‌ చౌరస్తాల్లో గాలించారు. 

స్నేహితురాళ్లకు ఫోన్‌ చేసి కనుక్కున్నా ఉపయోగం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు జరపడంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలో విద్యార్థిని స్కూల్‌ బ్యాగ్‌ కనిపించింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు మూడు బీరు సీసాలతోపాటు తినుబండారాల ప్యాకెట్లు మాత్రమే కనిపించాయి. 

గ్రామ ప్రజలే గాలింపు జరిపారు. వారికి స్కూల్‌ బ్యాగు లభ్యమైన ప్రదేశానికి 100 గజాల దూరంలోని మరో పాడుబడిన బావిలో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు బావిలో తవ్విచూడగా బాలిక మృతదేహం లభ్యమైంది. ఇదంతా జరిగేటప్పటికి శుక్రవారం రాత్రి అయింది. బయటకు తీసిన మృతదేహాన్ని పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
బొమ్మలరామారం నుంచి హాజీపూర్‌కు వెళ్లే క్రమంలో విద్యార్థినిని తెలిసినవాడే నమ్మించి తీసుకెళ్లి ఉంటాడని, అక్కడ ఇతరులతో కలిసి దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం తాగిన ఆనవాళ్లు, సీసాలు లభ్యం కావడంతో పాటు బాలిక మృతదేహాన్ని లోతైన పాడుబడిన వ్యవసాయ బావిలో పూడ్చిపెట్టడం వంటివాటిని గమనిస్తే ఘటనలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. 

శ్రావణి కేసుకు సంబంధించి హాజీపూర్‌కు చెందిన ఒక యువకుడిని వారు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తునకు ఆరు ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత