మహిళలు, యువతులకు న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..ముగ్గురు అరెస్ట్..నిందితుల్లోల పోలీసులు, పొలిటీషియన్స్ ??
మహబూబ్ నగర్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో మహిళలు, యువతులను లోబర్చుకుని వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ ముఠా గుట్టు బయట పడింది.
మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు మహిళలు, యువతులను లోబర్చుకుని న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ బాగోతంలో ఇప్పటివరకు అరెస్ట్ అయిన ముగ్గురు ఓ ప్రధాన పార్టీకి చెందిన యువ నాయకులే. వారితో పాటే ఓ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ కౌన్సిలర్ భర్త, పలువురు పోలీసులకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ కీలక నేత రంగంలోకి దిగారని, తమకూ మరకలు అంటుతుండటంతో ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గొడవపడడడంతో.. బయట పడింది..
గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా మహిళలను, అమ్మాయిలను ట్రాప్ చేసి లోబర్చుకున్నారు. వారి నగ్న వీడియోలు, కాల్స్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరింతగా వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల పలువురు మహిళల అర్థనగ్న వీడియోలు సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమవడంతో ఈ ట్రాప్ అంశం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. గద్వాలకు చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి ఫోన్ నుంచి సదరు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినట్లు గుర్తించారు. అతడిని విచారించగా.. గద్వాలకే చెందిన నిఖిల్, వినోద్ ల పాత్ర వెలుగులోకి వచ్చింది. వారిమధ్య విభేదాలు తలెత్తడంతోనే ఒకరికి సంబంధించిన రహస్యాలను మరొకరు బయటపెట్టినట్లు తేలింది.
కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్:కానిస్టేబుల్ కి గాయాలు
తారుమారు చేశారా ?
ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. ‘తిరుమలేశ్ ఓ పార్టీలో మద్యం తాగి స్పృహ లేకుండా పడిపోయినప్పుడు కాశపోగు నిఖిల్ అతడి ఫోన్ లోని మహిళల సెమీ న్యూడ్ ఫోటోలు, వీడియోలను చూసి తన మిత్రుడు వినోద్ కి పంపాడు. వినోద్ తన స్నేహితుడైన క్రాంతికి పంపాడు. తిరుమలేష్, క్రాంతి ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు. దీంతో తిరుమలేష్ గురించి చెప్పేందుకు క్రాంతితో పాటు ఓ కౌన్సిలర్ భర్త రంజిత్ కి పంపాడు’ అని ఎస్పి రంజాన్ రతన్ కుమార్ వెల్లడించారు. అయితే, ఈ కేసును తారుమారు చేశారంటూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ఒకరిని తప్పించేందుకు రూ. 30 లక్షలకు బేర కుదిరిందని ముందు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టడీ సర్కిల్ వేదికగా ట్రాప్..
ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన క్రమంలో జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేశారు. దాన్ని వేదికగా చేసుకుని ఓ ముఠా అమాయక యువతులు, మహిళలకు గాలం వేసి ఫోటోలు, న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ కు పాల్పడిన ట్లు సమాచారం. గత నాలుగైదు నెలల్లో 50మంది వరకు వారి బారిన పడ్డారని.. కానీ పరువు పోతుందన్న భయంతో బయటకు చెప్పడం లేదని తెలిసింది. గద్వాలలో మూడు ముఠాలు ఇలా మహిళలను ట్రాప్ చేసి బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, గద్వాల వ్యవహారంలో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కొందరు పోలీసుల సహకారం కూడా ఉందని వినిపిస్తోందని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎక్బాల్ పాషా ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీఐని బదిలీ ఎందుకు చేశారు..
ఈ వ్యవహారంలో గద్వాలకు చెందిన ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ నిందితుడితో సదరు ఎస్ఐకి ‘ఖరీదైన’ స్నేహంతో పాటు భాగస్వామ్యం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కోణాల్లో విచారణ చేపట్టామని, ఇప్పటివరకు పోలీసుల పాత్ర ఏమీ తేల లేదని ఎస్పీ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ సాయంత్రమే సదరు ఎస్సైని బదిలీ చేయడంపై జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది.